చైత్ర శుద్ద నవమి ( ఏప్రిల్ 17) హిందువులకు ఎంతో ముఖ్యమైర రోజు.. ఆరోజు ప్రతి వీధి కోలాహలంగా మారుతుంది. అదేనండి ఆరోజు సీతారాముల పెళ్లంట... అదే రోజు అభిజిత్ ముహూర్తం.. కర్కాటక లగ్నంలో రామయ్య తండ్రి.. సీతమ్మ తల్లి.. ఒక్కటయ్యారని పురాణాలు చెబుతున్నాయి.
చైత్ర మాస శుక్ల పక్ష నవమి ( ఏప్రిల్ 17) శ్రీరామనవమి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో... మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడని పురాణాలు ద్వారా తెలుస్తోంది. దీన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. హిందువుల పండుగల్లో శ్రీరామనవమి ముఖ్యమైంది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినము, కల్యాణమూ కూడా... పురాణాలను అనుసరించి రాముడు త్రేతాయుగంలో పుట్టాడు. జ్యోతిష్య పండితులు పరిశోధనలు జరిపి శ్రీరాముడు క్రీస్తుకు పూర్వం 5114, జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చని అంచనా వేశారు.
దశరథ మహారాజు, కౌసల్యల నందనుడు శ్రీరామచంద్రుడు. భరతునికి పట్టాభిషేకం జరగాలంటే శ్రీరాముడు రాజ్యంలో ఉండకూడదని తలచింది కైకేయి. అందుకే ఆమె రాముని 14 సంవత్సరాలపాటు అడవులకు పంపమని, దశరథుని కోరింది. తండ్రికోసం ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించి అరణ్యవాసం చేశాడు శ్రీరాముడు. ఆయనతోబాటు లక్ష్మణుడు, సీతమ్మవారు అరణ్యవాసం చేశారు. రామబంటుగా పిలవబడే హనుమంతుడు కూడా నిరంతరం రాముని వెన్నంటి ఉన్నాడు. తన హృదయంలో శ్రీరాముని ప్రతిష్టించుకున్నాడు.
పితృవాక్య పరిపాలకుడు ఏకపత్నీవ్రతుడు అయిన శ్రీరాముని ఎంత కీర్తించినా తక్కువే. రామ పదానికి ఉన్న శక్తి అనంతం. రామ నామం జపిస్తే చాలు ఇష్టార్ధ సిద్ధి ప్రాప్తిస్తుంది. రామాయణాన్ని పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. రామనామం పరమ పవిత్రమైంది. రామనామ స్మరణతో చేసిన పాపాలు హరిస్తాయి. సర్వ సౌఖ్యాలూ కలుగుతాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శ్రీరామనవమి పర్వదినాన మనసా వాచా కర్మణా శ్రీరాముని ఆరాధించి పుణ్యం సంపాదించుకుందాం. ముఖ్యంగా -
''శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరాననో''
అనే పవిత్ర మంత్రాన్ని పూజా సమయంలో తొమ్మిదిసార్లు స్మరించుకుంటే ఎలాంటి కష్టనష్టాలూ ఉండవని, సకల సంపదలూ కలుగుతాయని పెద్దలు చెప్తారు.
కొందరు శ్రీరామనవమిని దసరా నవరాత్రుల మాదిరిగా తొమ్మిదిరోజులపాటు పండుగ చేస్తారు. అనేక రామాలయాల్లో శ్రీరామనవమి నవరాత్రులు ఉత్సవాలు జరుపుతారు కనుక ఈ పండుగను ''శ్రీరామ నవరాత్రి'' అని కూడా అంటారు. కొందరు చైత్ర శుక్లపక్ష నవమి నాడు మాత్రమే వేడుక చేస్తారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో హోలీని తలపించే వసంతోత్సవం జరుపుతారు. సాయంత్రం జరిగే ఉత్సవంలో పరస్పరం రంగునీళ్ళు పోసుకుంటారు. శ్రీరామనవమి పర్వదినాన రధయాత్ర నిర్వహిస్తారు. రామ భక్తులు శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలేనివారు పానకము, పండ్లు సేవిస్తారు.
విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు. "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని చెప్పినట్టుగా అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని సంరక్షించేందుకు శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరామనవమి రోజున ఆలయాలను అందంగా అలంకరిస్తారు. వేదమంత్రాలతో పునీతమైన దేవాలయాలు ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీరాముడు మధ్యాహ్నం పుట్టినందున ఆ సమయానికి సీతారాముల కళ్యాణం చేస్తారు. పూజ, హారతి ముగిశాక ప్రసాదం పంచుతారు. బెల్లం, మిరియాలపొడి, నీళ్ళలో కలిపి తయారుచేసిన పానకం, పెసరపప్పు నానబెట్టి చేసిన వడపప్పు , బియ్యప్పిండిలో బెల్లం, నీళ్ళు కలిపి చేసిన చలిమిడి రామ నవమి ప్రసాదాలు. శాస్త్రీయంగా చూస్తే ఇవన్నీ చలవ చేసే పదార్థాలు. ఈ పండుగ వచ్చేది ఎండాకాలం కనుక వీటిని సేవిస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రసాదంగా రూపొందించారు.
శ్రీరామనవమి రోజున ఆలయాల్లో సీతారాముల విగ్రహాలకు కనులపండుగ్గా కల్యాణం జరుపుతారు. తెలంగాణలో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మహా వైభవంగా జరుగుతుంది. ''సీతారాముల కల్యాణం'' చూసి పరవశించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివెళ్తారు. కల్యాణం ముగిసిన తర్వాత భక్తజన సందోహం అనుసరించిరాగా ఉత్సవ మూర్తులను వీధుల్లో ఊరేగిస్తారు. ఒక్క భద్రాచలంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గ్రామంలో.. పెద్ద గ్రామాలైతే.. ప్రతి వీధిలోనూ సీతారామ కళ్యాణం జరుపుతారు. కొన్ని దేవాలయాల్లో కళ్యాణం తరువాత రోజు సీతారామ, లక్ష్మణ, హనుమానుల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరాముని భక్తిగీతాలు, భజనలతో ఆలయాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. అడుగడుగునా రామనామం వినిపిస్తూ చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది. రామ నవమి సందర్భంగా సీతారామలక్ష్మణులతోబాటు రామ భక్త హనుమాన్ని కూడా ఆరాధిస్తారు