Sri Rama Navami : ప్రతిష్ఠాపన ముహూర్తానికే..సీతారాముల ఉత్సవాలు

కొన్ని పండుగలు ఒక్కోచోట ఒక్కో రకంగా జరుపుకుంటారు. కానీ.. శ్రీరామనవమి లాంటి పండుగలు మాత్రం దేశమంతా ఒకే రోజున దాదాపు ఒకేలా చేసుకుంటారు. అయితే వనపర్తి మండలం పెద్దగూడెంలో ఉత్సవాలు మాత్రం కాస్త భిన్నంగా చేస్తారు.

ఈ ఊళ్లో కోదండరామస్వామి ఆలయాన్ని వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించినట్లు స్థల పురాణం చెప్తోంది. ఆలయాన్ని వనపర్తి సంస్థానాధీశులు రాణి శంకరమ్మ తన భర్త రాజారామేశ్వరరావు ఙ్ఞాపకార్థం శాలివాహన శకం1791లో కట్టించారు. 

అప్పట్లో తమిళనాడులోని వానమామలై మఠాధిపతి మధురకవి రామానుజస్వామి చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్ఠాపన జరిగింది. ప్రతిష్ఠాపన ముహూర్తాన్ని బట్టి జీయర్ స్వామి ఇచ్చిన సలహాతో ఇక్కడ ప్రతి ఏటా రాత్రి పూట ఉత్సవాలు చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. దేశమంతటా శ్రీరామ నవమిరోజున సీతారాముల కల్యాణం జరుగుతుంది.

ఇక్కడ మాత్రం సప్తమి రోజున సీతారాముల కల్యాణం జరుగుతుంది. సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ఉత్సవాలను ఇలాగే నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. 

వనపర్తి, వెలుగు