రాముడు హిందువులకే కాదు.. ప్రపంచానికి దేవుడు: ఫరూక్ అబ్దుల్లా

రాముడు హిందువులకే కాదు.. ప్రపంచానికి దేవుడు: ఫరూక్ అబ్దుల్లా

పూంచ్: శ్రీరాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ చెందిన వాడని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఈ విషయం యావద్దేశానికి తాను చెప్పదలచుకున్నానని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోని ప్రజలందరికీ రాముడు దేవుడని, ఆ విషయం పుస్తకాల్లో కూడా రాసుందని చెప్పారు. 

సౌభ్రాతృత్వం, ప్రేమ, ఐక్యత, పరస్పర సహకారం వంటివి రాముడు మానవాళికి ఇచ్చిన సందేశాలని తెలిపారు. మతం, జాతి భేదం లేకుండా బడుగువర్గాల అభ్యున్నతికి పాటుపడాలని రాముడు చెప్పారని, రామాలయం ప్రారంభోత్సవ తరుణంలో దేశంలో క్షీణిస్తున్న సౌభ్రాతృత్వ భావనలను తిరిగి పునరుద్ధరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. రామాలయం నిర్మాణానికి కృషి చేసిన వారికి అబ్దుల్లా అభినందనలు తెలిపారు.