లోక్​పాల్​ వ్యవస్థ - ఇండియన్ పాలటీ గ్రూప్స్ ప్రత్యేకం

ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు సంక్షేమం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాయి. అభివృద్ధిని సాధించే క్రమంలో విస్తరించే ఉద్యోగస్వామ్యం విధులు, బాధ్యతలు పెరగడం వల్ల అవినీతి, పరిపాలనలో డొల్లతనం పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా వాటిని రూపుమాపడానికి ప్రపంచంలో మొదటగా స్కాండినేవియా దేశాల్లో (స్వీడన్​, డెన్మార్క్​, ఫిన్లాండ్​, నార్వే) నిఘా సంస్థలను ఏర్పాటు చేశారు. వీటినే అంబుడ్స్​మన్​ అని అంటారు. అంబుడ్స్​మన్​ వ్యవస్థ స్వీడన్​లో 1809లో సృష్టించారు. 

ఆ తర్వాత 1919లో ఫిన్లాండ్, 1955లో డెన్మార్క్​, 1962లో నార్వేలో ఈ వ్యవస్థ మొదలైంది. కామన్​వెల్త్​ దేశాల్లో మొదటిసారిగా 1962లో న్యూజిలాండ్​లో పార్లమెంటరీ కమిషనర్​ ఫర్​ ఇన్వెస్టిగేషన్​ అనే పేరుతో అంబుడ్స్​మన్​ వ్యవస్థ ఏర్పడింది. యునైటెడ్​ కింగ్​డమ్​లో 1967లో అంబుడ్స్​మన్​ వ్యవస్థను పోలిన పార్లమెంటరీ కమిషన్​ ఫర్​ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఏర్పడింది. 

లోక్​పాల్​ నిర్మాణం: ఒక చైర్మన్, ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. చైర్మన్​ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గానీ, సుప్రీంకోర్టు జడ్జిగా గానీ పని చేసి ఉండాలి. సభ్యుల్లో సగం మంది సభ్యులు జుడీషియల్​ మెంబర్స్​, మిగతా సగం పరిపాలన, అవినీతి నిర్మూలన, ఇతర రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గానికి చెంది ఉండాలి.  

నియామకం: చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఈ నియామకం సెలెక్షన్​ కమిటీ సిఫారసు మేరకు ఉంటుంది. సెలెక్షన్​ కమిటీ చైర్మన్​ గా ప్రధాన మంత్రి, సభ్యులుగా లోక్​సభ స్పీకర్​, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన సిఫారసు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, చైర్​పర్సన్​, సభ్యులు ప్రతిపాదించిన ఒక నిష్ణాతుడైన జ్యూరిస్ట్​ ఉంటారు. 

షరతులు: పార్లమెంట్, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత శాసనసభల్లో సభ్యుడిగా ఉండరాదు. 

అనర్హతలు: స్థానిక సంస్థల్లో (పంచాయతీ లేదా మున్సిపాలిటీ) సభ్యుడిగా ఉండరాదు. పదవీ ప్రమాణం చేసిన తేదీ నాటికి 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండరాదు. నేరారోపణ రుజువై ఉండరాదు, కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీచ్యుతుడై ఉండరాదు. 

పదవీకాలం: ఐదు సంవత్సరాలు లేదా వారి వయస్సు 70 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందైతే అది వర్తిస్తుంది. పునర్నియామకానికి అర్హులు కారు. అయితే, సభ్యులను వారి పదవీకాలం ముగియక ముందే  చైర్మన్​గా నియమించవచ్చు. అయితే, మొత్తం పదవీకాలం (సభ్యునిగా + చైర్​పర్సన్​గా) ఐదు సంవత్సరాలు మించరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి లాభదాయక పదవులు చేపట్టరాదు. కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్​గా నియమించకూడదు. పదవీ విరమణ చేసిన తర్వాత ఐదేండ్ల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్​సభ, రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలకు పోటీ చేయరాదు. 

తొలగింపు: అక్రమ ప్రవర్తన, అసమర్థత లేదా దివాలా తీయడం కారణాల వల్ల చైర్మన్​, సభ్యులను రాష్ట్రపతి తొలగిస్తారు. 

రాజీనామా: చైర్మన్​, సభ్యులు తమ సొంత రాతపూర్వక రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. 

నివేదికలు: వార్షిక నివేదికను రాష్ట్రపతికి ఇవ్వగా, రాష్ట్రపతి పార్లమెంట్​ ముందు ఉంచుతారు.

లోక్​పాల్​ పరిధి: ప్రధాన మంత్రి (దేశ రక్షణ, విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను మినహాయించి) , కేంద్ర మంత్రి మండలి సభ్యులు, లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, కేంద్ర ప్రభుత్వాధికారులు, ఏడాదికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ విదేశీ విరాళాలు పొందే ఎన్​జీవోలు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కార్పొరేషన్​ ఉద్యోగులు, ఆలిండియా సర్వీసు ఉద్యోగులు.

విచారణ: ప్రధాన మంత్రితో సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించే అధికారం లోక్​పాల్​కు ఉంటుంది. అయితే, జాతీయ భద్రత, ప్రజా భద్రత అంశాలకు సంబంధించి ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు. ప్రాసిక్యూట్​ చేయడానికి పూర్వానుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. 
    విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది.  

ఆరోపణలు ఉన్న అధికారులను సస్పెండ్​ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే అధికారం ఉంది.  
ఫిర్యాదుపై ఆరు నెలల్లో విచారణ ముగించాలి. శిక్ష రెండు నెలల నుంచి యవజ్జీవ కారాగార శిక్ష వరకు ఉంటుంది.
లోక్​పాల్​ వ్యవస్థకు సివిల్​ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
ఏ అధికారినైనా తమ ముందు హాజరుకమ్మని ఆదేశించవచ్చు.
రికార్డులను, డాక్యుమెంట్లను పరిశీలించవచ్చు. 

లోకాయుక్త

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టాన్ని 1983లో చేశారు. ఈ చట్టాన్ని 2016లో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఇండియాలో   మొదటిసారిగా ఒడిశా 1970లో చట్టం రూపొందించినా 1983లో అమల్లోకి వచ్చింది. కానీ, 1971లో మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో లోకాయుక్త వ్యవస్థలు పనిచేస్తున్నాయి. పుదుచ్చేరి ఇప్పటికే లోకాయుక్త బిల్లును ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. 

నియామకం: హైకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని లోకాయుక్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు గవర్నర్​ నియమిస్తారు. జిల్లా న్యాయమూర్తిని ఉప లోకాయుక్తగా నియమిస్తారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

పదవీ కాలం: ఐదు సంవత్సరాలు. లోకాయుక్తకు సివిల్​ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. వీరు పదవీ విరమణ తర్వాత ఐదేండ్ల వరకు ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టరాదు.

తొలగింపు: రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజార్టీ (2/3  వంతు) మేరకు అక్రమ ప్రవర్తన, అసమర్థత అనే కారణాలపై గవర్నర్​ తొలగిస్తారు. 

లోకాయుక్త పరిధి: రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, జెడ్పీ చైర్మన్లు, సభ్యులు, మున్సిపల్​ కార్పొరేషన్​ మేయర్లు, మున్సిపల్​ చైర్మన్లు, యూనివర్సిటీల వైస్​ చాన్సలర్లు, రిజిస్ట్రార్లు.

మినహాయింపులు: ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్​, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

భారతదేశంలో లోక్​పాల్​

లోక్​కి అర్థం ప్రజలు, పాల్​కి అర్థం కేర్​టేకర్​.

1959: కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి.దేశ్​ముఖ్​ లోక్​పాల్​ ఏర్పాటుకు ప్రతిపాదన చేశాడు.
1964: కే సంతానం నేతృత్వంలోని పాలనా సంస్కరణల సంఘం కేంద్ర స్థాయిలో లోక్ పాల్​, రాష్ట్ర స్థాయిల్లో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని సూచన.
1968: లోక్​పాల్​ బిల్లును మొదటిసారిగా పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు.
2011: పదోసారి ప్రవేశపెట్టిన లోక్​పాల్​ బిల్లు చట్టరూపం దాల్చింది. 2013లో పార్లమెంట్​ బిల్లుకు ఆమోదం తెలుపగా, 2014, జనవరి 1న రాష్ట్రపతి ఆమోదించాడు. 2014 జనవరి 16 నుంచి లోక్​పాల్​, లోకాయుక్త చట్టం – 2013 అమలులోకి వచ్చింది. 
లోక్​పాల్​లోగో  
లోక్​పాల్​ మోటో: మా గ్రిధా కాస్యస్విధానమ్​. దీనిని ఇషోబసోపనిషత్​ నుంచి సంగ్రహించారు. 
లోక్​పాల్​ లోగోను రూపొందించింది: ప్రశాంత్​ మిశ్రా (ఉత్తరప్రదేశ్​)
లోక్​పాల్​లో చేర్చిన ప్రతిమలు 
1.అంబుడ్స్​మన్​
2. ముగ్గురు మానవులు 
3. విజిలెన్స్​ (కన్నుతో ఉన్న అశోక చక్ర)
4. న్యాయం (పుస్తక ఆకారం)
5. జుడీషియల్​ (రెండు త్రివర్ణ చేతులు కింద సమతుల్యం చేస్తూ ఉండటం)