ఓబీసీ బిల్లుకు లోక్​సభ ఓకే

ఓబీసీ బిల్లుకు లోక్​సభ ఓకే

న్యూఢిల్లీ: ఓబీసీ లిస్టును సొంతంగా తయారు చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ సభ మంగళవారం ఆమోదం తెలిపింది. మొత్తం 385 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ‘‘ఇది చారిత్రాత్మకమైన బిల్లు. ఇది చట్టంగా మారితే దేశంలోని 671 కులాలకు లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ ఈ రాజ్యాంగ సవరణ తీసుకురాకపోతే వారందరూ రిజర్వేషన్లు కోల్పోయేవారు” అని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ మినిస్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ.. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ‘‘2018లో 102వ రాజ్యాంగ చట్ట సవరణ తీసుకొచ్చారు. అయితే అది ప్రజలు కోర్టుకు వెళ్లేందుకు అవకాశమిచ్చింది. ఫలితంగా సుప్రీంకోర్టు రాష్ట్రాల అధికారాలను తొలగించింది” అని ఆయన గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షాలు చేసిన సూచనను చట్టంలో చేర్చి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల గోడు వినాలని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు వాటికి చట్టమైన అధికారం ఇవ్వాలని కోరారు. కాగా, ఈ బిల్లును సోమవారం మినిస్టర్ వీరేంద్ర కుమార్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు మద్దతిస్తామని ప్రతిపక్షాలు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.