SL vs NZ: అంతర్జాతీయ క్రికెట్‌లో RCB ప్లేయర్ హ్యాట్రిక్

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో మరో హ్యాట్రిక్ నమోదయింది. న్యూజిలాండ్  ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి తన కెరీర్ లో తొలి హ్యాట్రిక్ సాధించాడు. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకపై జరిగిన రెండో టీ20లో కివీస్ ఫాస్ట్ బౌలర్ ఈ ఘనతను అందుకున్నాడు. అయితే ఈ హ్యాట్రిక్ ఒకే ఓవర్ లో నమోదు కాలేదు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతికి యార్కర్ వేసి కుశాల్ పెరీరాను బోల్తా కొట్టించాడు. 

8 ఓవర్ మొదటి బంతికి మరో అద్భుత యార్కర్ తో సూపర్ ఫామ్ లో ఉన్న కామిందు మెండీస్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఇక రెండో బంతికి లంక కెప్టెన్ అసలంకను ఔట్ చేసి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. ఫెర్గూసన్ హ్యాట్రిక్ తో శ్రీలంక కోలుకోలేకపోయింది. ప్రధాన బ్యాటర్లు ఔట్ కావడంతో ఒత్తిడి తట్టుకోలేక స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో రెండే ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 

ఐపీఎల్ 2024 సీజన్ లో లాకీ ఫెర్గుసన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అరంగేట్రం చేశాడు. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఆర్సీబీ RTM కార్డు ఉపయోగించి ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ ను తీసుకుంటుందేమో చూడాలి. ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. హసరంగా 4 వికెట్లు తీసి సత్తా చాటగా.. ఫాస్ట్ బౌలర్ పతిరానా 3 వికెట్లతో నిప్పులు చెరిగాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 103 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 5 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచి రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 1-1 తో సమం చేసింది.