లాక్ డౌన్ రూల్స్: తెలంగాణ వాసులు రావడంపై ఏపీ ఆంక్షలు

లాక్ డౌన్ రూల్స్: తెలంగాణ వాసులు రావడంపై ఏపీ ఆంక్షలు

అంత‌ర్ రాష్ట్ర ప్ర‌యాణ రాక‌పోక‌ల‌కు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. దీనికి క‌నుగుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా వ‌చ్చే ప్ర‌యాణీకుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.. దీంతో ఎపిలోని వారు తెలంగాణ‌కు రోడ్డు మార్గంలో తిరిగి వ‌స్తున్నారు. అయితే ఎపి మాత్రం తెలంగాణ వాసులు రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించింది.. రోడ్డు మార్గంలో వ‌చ్చే ప్ర‌యాణీకులు అనుమ‌తి లేద‌ని ఆ రాష్ట్ర డిజిపి గౌత‌మ్ స‌వాంగ్ ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులను విభజించి క్వారంటైన్‌కు తరలిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు అంతరాష్ట్ర రాకపోకలపై కండీషన్స్ కొనసాగుతాయని తెలిపారు. ఒకవేళ తప్పదు అని అనుకుంటే స్పందన పోర్టల్ ద్వారా ఆప్లై చేసి ఈ పాస్ తీసుకోవాలని సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రయాణికులను అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. బస్సు ప్రయాణికులకు రాత్రి పూట కర్ఫ్యూ నుంచి కూడా సడలింపులను కేసీఆర్ సర్కారు కల్పించింది. బస్టాండ్లలోకి ఆటోలు, క్యాబ్ లకు కూడా అనుమతిచ్చింది. ఇక ఇదే సమయంలో ఏపీ మాత్రం ఇంకా ఆంక్షలను సడలించలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ తమ రాష్ట్రానికి వచ్చే వారు క్వారంటైన్ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ ఆన్ లైన్ బుకింగ్ సేవలను కూడా ప్రారంభించింది. రాష్ట్రం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు అన్ని రకాల సర్వీసులకూ రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి మాత్రం ఇంకా రిజర్వేషన్లు ప్రారంభం కాలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ఏపీ సర్కారుతో చర్చించి, ప్రజలకున్న ఇబ్బందులు తొలగించేలా నిర్ణయాలు తీసుకునేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.