ఏపీ: కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ఆయా కృష్ణా, గుంటూరు, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ 1, లాక్ డౌన్ 2 తరహాలో కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ అమలులో ఉదాసీనంగా వ్యవహరించకుండా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్.. వ్యక్తిగత శుభ్రత.. శానిటైజేషన్ విషయంలో అందరిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అనంతపురం పోలీసులు వెరైటీగా అందర్నీ ఆలోచింపచేసేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. టుటౌన్ సీఐ జాకీర్ హుసే న్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది గుర్రాలపై తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నివారణ బ్యానర్లతో గుర్రాలను అలంకరించి .. జనం గుమిగూడే ప్రదేశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించి వారిలో సామాజిక స్ఫూర్తి ని కలిగించేందుకే ఈ ప్రయత్నమని చెప్పారు. అక్షరాస్యులు సైతం అప్రమత్తంగా వ్యవహరించకపోతే కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అందరిలో చైతన్యం తీసుకొచ్చేందుకు అనంతపురం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అభినందించారు.


