కర్నూలు: రాఘవేంద్రస్వామి కొలువై ఉన్న మంత్రాలయం క్షేత్ర పరిధిలో రేపటి నుండి మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా విజృంభిస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధిస్తున్నాని అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరచుకోవడానికి అనుమతించారు. 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వీధుల్లోకి రాకూడదని.. వస్తే కరోనా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఏపీ.. తెలంగాణ.. కర్నాటక రాష్ర్టాలకు సరిహద్దు కేంద్రంగా తుంగభద్ర నది తీరంలో ఉన్న మంత్రాలయం క్షేత్రానికి మూడు రాష్ర్టాలకు చెందిన వేలాది మంది భక్తులు వస్తుంటారు. తెలుగుతోపాటు.. కన్నడ కూడా స్థానిక భాషగా వాడుకలో ఉంటుంది. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో.. తుంగభద్ర నదికి వరద ప్రవాహం మొదలైంది. దీంతో భక్తులు, టూరిస్టుల రద్దీ కూడా పెరుగుతూ వస్తోంది. వచ్చే నెలలో స్వామి వారి ఆరాధనోత్సావాలు జరుగుతాయో లేదోనన్న ఆందోళన నేపధ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్ తోపాటు.. ఆఫ్ లైన్ లో… కౌంటర్ల వద్ద కూడా రద్దీ పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు స్పందించారు.
ఉన్నతాధికారుల హెచ్చరికల నేపధ్యంలో శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సీఐ కృష్ణయ్య, ఈవోపీఆర్డి నాగేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు సమీక్షించారు. ముఖ్యంగా కర్నాటక రాష్ట్రం నుంచి యువతి, యువకులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. రాయచూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున వారిని మంత్రాలయం లోకి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చర్చించారు. వచ్చే నెలలో స్వామి వారి ఆరాధనోత్సవాల నాటికి ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. లాక్ డౌన్ విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదన నిర్ణయించారు. ఈ మేకు ఆదివారం నుంచి లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు, హోటల్ లకు అనుమతి ఉందని 11 గంటల తర్వాత ఎవ్వరైనా బయటకు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఐ ని కోరారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రాకూడదని దీనికి తోడు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ బంక్ లు కూడా బంద్ పాటించాలని సూచించారు. ఆదివారం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.


