వాడిని మీరు చంపుతారా.. మమ్మల్ని చంపమంటారా : హై టెన్షన్లో మహారాష్ట్ర

మహారాష్ట్ర అట్టుడికిపోతుంది.. బదల్పూర్లోని ఓ ప్లే స్కూల్లో నాలుగేళ్ల పసి పాపపై అత్యాచారం చేయటంపై.. బదల్పూర్ జనం మండిపోయారు.. ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే.. బదల్ పూర్ జనం ఎవరికి వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. ప్లే స్కూల్ ను ధ్వంసం చేశారు.. అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశారు.

 

నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేసిన వాళ్లను మీరు చంపుతారా.. మమ్మల్ని చంపమంటారా అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముట్టడించారు. న్యాయం ఇప్పుడే జరగాలి.. ఇక్కడే జరగాలి అంటూ రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. బదల్ పూర్ పట్టణంలో బంద్ చేశారు. షాపులు మూయించారు.. బదల్ పూర్ జనం ఆగ్రహాన్ని చూసిన మహారాష్ట్ర సీఎం వెంటనే రంగంలోకి దిగారు. సిట్ విచారణకు ఆదేశించారు సీఎం షిండే.

బదల్పూర్లో ఏం జరిగింది:
బదల్పూర్లో ఓ ప్లే స్కూల్ ఉంది. అక్కడ 23 ఏళ్ల మగ అటెండర్ పని చేస్తున్నాడు. వాడు చిన్న పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆగస్ట్ 12వ తేదీన ఇద్దరు చిన్నారులు.. తమకు స్కూల్లో జరిగిన సంఘటనను పేరంట్స్కు చెప్పారు. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారులపై లైంగిక దాడి జరిగినట్లు.. బలవంతం జరిగినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఈ విషయంపై స్కూల్ లోని పేరంట్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. అప్పటికిప్పుడు ప్రిన్సిపాల్ ను, సిబ్బందిని తొలగించింది యాజమాన్యం. ఆ తర్వాత 23 ఏళ్ల అటెండర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సీసీకెమెరాలు పరిశీలించగా.. టాయిలెట్స్ దగ్గర మగ అటెండర్.. చిన్నారులతో లోపలికి వెళ్లిన విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. ఆగస్ట్ 17వ తేదీన ఈ ఘటన వెలుగులోకి రాగా.. ఇప్పుడు అది నిప్పుగా మారింది.