పునరుద్ధరణ కమిటీపై ఆగ్రహం

  • నలుగురికే అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు

సిద్దిపేట/జగదేవ్​పూర్, వెలుగు: కొండ పొచమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీని కేవలం నలుగురు సభ్యులతో ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏడాది పాటు కొనసాగే కమిటీలో కేవలం నలుగురికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆలయ కమిటీని చైర్మన్ తో కలిపి 12 మంది సభ్యులతో  ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఆలయ పూజారి, దాతలతో పాటు స్థానికులకు అవకాశం కల్పిస్తారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి  కేవలం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ఏడాది పాటు ఇది కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆలయ వార్షికోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఆదరబాదరగా పునరుద్ధరణ  కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారనే  ఆరోపణలు  వినిపిస్తున్నాయి. 

బందోబస్తు మధ్య దర్శనాలు

కొండపొచమ్మ అమ్మవారిని శుక్రవారం కొత్తగా నియమితులైన నలుగురు సభ్యులు పోలీసు బందోబస్తు మధ్య దర్శనం చేసుకున్నారు. పునరుద్ధరణ కమిటీలో పూజారితో పాటు స్థానికులెవరికీ  అవకాశం కల్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో దర్శననికి వచ్చినప్పుడు వారిని అడ్డుకునే అవకాశం ఉందనే సమాచారంతో ముగ్గురు ఎస్ఐలు, ఒక సీఐ, 15 మంది పోలీసులతో ఆలయ సమీపంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగా నియమితులైన  పునరుద్ధరణ కమిటీ సభ్యులు మెండె ఆగమల్లు, లింగాల వజ్రమ్మ, కొట ఆశయ్య, చెక్కల నరేశ్​బందోబస్తు మధ్య అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. 

విభేదాలకు ఆజ్యం ?

 కొండపొచమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు గజ్వేల్ నియోజకవర్గ నేతల మధ్య  విభేదాలకు ఆజ్యం పోసిందనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గంలో స్థానిక నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధిపత్య పోరుకు తెరలేపినట్లయింది.

ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన నలుగురికి మాత్రమే  పునరుద్ధరణ కమిటీలో చోటు లభించడంతో స్థానిక నేతలు మండిపడుతున్నారు. నిజానికి పునరుద్ధరణ కమిటీని 12 మందితో ఏర్పాటు చేసి ఇరు వర్గాల నేతలకు అవకాశ కల్పించాలి. కానీ అలా చేయకపోవడంతో మరో వర్గం నేతలు, స్థానికులు నేతల తీరును తప్పుబడుతున్నారు.