ప్యాకింగ్ చేసిన లస్సీ, బటర్ మిల్క్, పెరుగు, గోధుమ పిండి, తృణ ధాన్యాలు, తేనె, అప్పడాలు,ఆహార ధాన్యాలు, మాంసం, చేపలు (ఫ్రోజెన్ మినహా), మరమరాలు, బెల్లం మరింత ప్రియం కానున్నాయి. ఎందుకంటే.. వీటితో పాటు పలు డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులను 5 శాతంలోపు వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్లోకి చేర్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ఈమేరకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఫిట్మెంట్ కమిటీలతో కూడిన బృందం చేసిన సిఫారసులను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేయనుంది. ఆ వెంటనే ఆయా డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులకు జీఎస్టీ వర్తించనుంది. ప్రస్తుతం బ్రాండెడ్, ప్యాకేజ్డ్ ఫుట్ ఐటమ్స్ పై 5 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అన్ లేబుల్డ్ వస్తు ఉత్పత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది.
హోటల్ గదులు, ఆస్పత్రి గదుల అద్దెలపైనా..
ఇవాళ జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన వివరాలను సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. సామాన్యులు ఎక్కువగా వినియోగించే బడ్జెట్ హోటళ్లపైనా జీఎస్టీ బాదుడు తప్పేలా లేదు. ఒక రాత్రికి రూ.1000 కంటే తక్కువ రెంట్ ఉండే హోటల్ గదుల అద్దెలను, ఒక రోజుకు రూ.5వేల కంటే రెంట్ ఎక్కువుండే ఆస్పత్రి గదుల అద్దెలను 12 శాతం జీఎస్టీ శ్లాబ్ లోకి చేర్చే ప్రతిపాదనలను కూడా కౌన్సిల్ ఆమోదించింది. ఆన్ లైన్ గేమ్స్, క్యాసినో, హార్స్ రేసింగ్లలో ఆటగాళ్లు చెల్లించే ఎంట్రీ ఫీజుపై 28 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనపైనా కౌన్సిల్ భేటీలో కీలక చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
