ENG v AUS 2024: ఐదు బంతుల్లో నాలుగు సిక్సర్లు: ఆసీస్ స్టార్ బౌలర్‌ను చితకబాదిన ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ విధ్వంసక వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ చాలా రోజుల తర్వాత తన బ్యాట్ కు పని చెప్పాడు. ఈ మధ్య కాలంలో పేలవ ఫామ్ తో విమర్శలకు గురవుతున్న ఈ ఇంగ్లీష్ బ్యాటర్..జూలు విదిల్చాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 28 పరుగులు రాబట్టడం మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో లివింగ్‌స్టోన్ ఈ ఘనత సాధించాడు. 

వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో స్టార్క్ చివరి ఓవర్ వేశాడు. తొలి బంతికి సిక్సర్ బాదగా.. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడు, నాలుగు, ఐదు బంతులను సిక్సర్లుగా మలిచి వావ్ అనిపించాడు. చివరి బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్ లో ఏకంగా 28 వచ్చాయి. దీంతో స్టార్క్ వన్డేల్లో ఆసీస్ తరపున ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు సమ్పర్పించుకున్న చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read :- IND vs BAN ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

ఈ మ్యాచ్ లో లివింగ్‌స్టోన్ కేవలం 25 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. మొత్తం 27 బంతుల్లోనే 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు.. మూడు ఫోర్లు ఉన్నాయి. దీంతో లార్డ్స్‌లో వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ  అత్యధిక సిక్సర్ల రికార్డును నెలకొల్పాడు. 

లివింగ్‌స్టోన్ తో పాటు బ్రూక్ (87) చెలరేగడంతో ఇంగ్లాండ్ నాలుగో వన్డేలో 186 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కేవలం 126 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం 5 వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 2-2 తో సమంగా ఉన్నాయి.