ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‎తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. మెగా వేలం ప్రారంభం నుండి చివరి వరకు హోరా హోరీగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజ్‎లు పోటీ పడ్డాయి. దీంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజ్‎లు పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించాయి. తొలి రోజు వేలంలో టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రికార్డ్ సృష్టించాడు. ఢిల్లీ వదిలేయడంతో వేలంలోకి వచ్చిన పంత్‎ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజ్‎లు హోరాహోరీగా తలపడ్డాయి.

చివరకు లక్నో సూపర్ జైయింట్స్ పంత్‎ను కనీవినీ ఎరుగని రీతిలో రూ.27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ హిస్టరిలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ తర్వాత మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రికార్డ్ ధర పలికాడు. శ్రేయస్ అయ్యర్‎ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్‎ను రూ.23.75 కోట్ల కళ్లు చెదిరే ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, బౌలర్ అర్షదీప్ సింగ్ రూ.18 కోట్ల చొప్పున అమ్ముడుపోయారు. తొలి రోజు వేలంలో ఈ ఐదుగురే అత్యధిక పలికిన ఆటగాళ్లు. 

ఇదిలా ఉంటే.. తొలి రోజు వేలంలో కొందరు ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. వాళ్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజ్ ముందుకు రాకపోవడంతో అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు. ఫస్ట్ డే ఆక్షన్‎లో మొత్తం పదకొండు మంది ప్లేయర్లు అమ్ముడుపోలేదు. అన్ సోల్డ్ ప్లేయర్స్ జాబితాలో ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, టీమిండియా యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఉండటం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్‎ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజ్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ ఆసీస్ బ్యాటర్ అన్ సోల్డ్ ప్లేయర్ నిలిచాడు. ఫామ్ లేక సతమతమవుతుండటంతో బెయిర్ స్టో వైపు ఏ ఫ్రాంచైజ్ మొగ్గు చూపలేదు. దేశవాళీ క్రికెట్‎లో రాణిస్తూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫికీ ఎంపికైన దేవదత్ పడిక్కల్ అన్ సోల్డ్ ప్లేయర్ గా నిలవడం గమనార్హం.

ఫస్ట్ డే అమ్ముడుపోని ఆటగాళ్లు

1. డేవిడ్ వార్నర్ (బ్యాటర్)     
2. దేవదత్ పడిక్కల్ (బ్యాటర్)     
3. జానీ బెయిర్‌స్టో వికెట్ (కీపర్)     
4. వకార్ సలాంఖీల్ (బౌలర్)     
5. అన్మోల్‌ప్రీత్ సింగ్ (బ్యాటర్)     
6. లువ్నిత్ సిసోడియా (వికెట్ కీపర్)     
7. ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్)     
8. ఉత్కర్ష్ సింగ్ (ఆల్ రౌండర్)     
9. యష్ ధుల్ (బ్యాటర్)
10. శ్రేయస్ గోపాల్ (స్పిన్నర్)
11. పీయుష్ చావ్లా (స్పిన్నర్)
12. కార్తీక్ త్యాగి (బౌలర్)