హైదరాబాద్ పబ్బు‎ల్లో ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍లో మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‏గా మార్చాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‎లోని పలు పబ్బుల్లో యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‎తో డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

ఇందులో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిందని పోలీసులు తెలిపారు. శేర్లింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని క్వోరమ్ క్లబ్‎లో ఏడుగురికి డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ రాగా.. జూబ్లీహిల్స్‎లోని బేబీ లోన్‏లో 12 మందికి డ్రగ్ టెస్టులు చేయగా ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్‏కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళానికి చెందిన రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్‭కు చెందిన అబ్దుల్ రహీమ్‬లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.