ఈ ఇద్దరినీ సోషల్ మీడియా కలిపింది

సోషల్‌‌‌‌ మీడియాలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. వాళ్లిద్దరి మధ్య ఫ్రెండ్‌‌షిప్‌‌ మొదలైంది. తర్వాత అది ప్రేమగా మారింది. మూడేండ్ల తర్వాత పెండ్లి చేసుకున్నారు. వాళ్లను కలిపిన ఆ సోషల్‌‌ మీడియాలోనే వీడియోలు పోస్ట్ చేస్తూ.. లక్షలు సంపాదిస్తున్నారు. ఇద్దరూ యూట్యూబ్‌‌ ఛానెల్స్‌‌ పెట్టుకుని వ్లాగ్స్‌‌ చేస్తున్నారు. వాటికి కోట్లలో వ్యూస్‌‌ వస్తున్నాయి. 

కేరళకు చెందిన మనీష్ విష్ణు ఫేమస్‌‌ కంటెంట్ క్రియేటర్‌‌‌‌. మనీష్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తన భార్య సేన్‌‌శ్రీతో కలిసి తన ఛానెల్‌‌లో కామెడీ వీడియోలు, వ్లాగ్స్, ఛాలెంజ్‌‌లు, రియాక్షన్ వీడియోలు పోస్ట్‌‌ చేస్తుంటాడు. ఆ వీడియోలే అతనికి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్‌‌ను తెచ్చిపెట్టాయి. అతని ప్రత్యేకమైన స్టయిల్‌‌, క్రియేటివిటీ వల్ల ఛానెల్‌‌కు మంచి పేరొచ్చింది. 

ధైర్యం లేక.. 

మనీష్‌‌కు మొదట్నించీ సోషల్‌‌ మీడియాలో పాపులర్ కావాలనే కోరిక ఉండేది. అందుకే వీడియోలు చేసేవాడు. సేన్‌‌శ్రీకి వీడియోలు చేయాలనే కోరిక ఉన్నా భయంతో చేసేది కాదు. వీడియోలు షూట్​ చేసి, ఎడిటింగ్‌‌ కూడా చేసేది. కానీ.. సోషల్‌‌ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయకుండానే డిలీట్​ చేసేది. వాటిని పబ్లిష్‌‌ చేసే ధైర్యం ఉండేది కాదు ఆమెకు. వీడియో పోస్ట్‌‌ చేస్తే ఎలాంటి కామెంట్స్ వస్తాయో, ఎవరేం అనుకుంటారో అని వెనకాడేది. 

అందుకే చివరికి టిక్‌‌టాక్‌‌లో డబ్​స్మాష్​ చేయాలని డిసైడ్​ అయింది. అలా టిక్‌‌టాక్ ద్వారా సోషల్‌‌మీడియాలోకి వచ్చింది. టిక్‌‌టాక్‌‌లో   ఫేమస్‌‌ అయ్యి.. అప్పుడప్పుడే ప్రమోషన్లు, స్పాన్సర్‌‌‌‌షిప్‌‌లు వస్తున్నాయి అనుకున్నప్పుడు టిక్‌‌టాక్ బ్యాన్ చేశారు. దాంతో యూట్యూబ్‌‌లో ఛానెల్‌‌ పెట్టింది. ఆ టైంలో మనీష్‌‌తో పరిచయం ఏర్పడింది. 

జీవితంలోకి సేన్‌‌శ్రీ 

సెన్‌‌శ్రీ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో యాక్టివ్‌‌గా ఉండేది. రీల్స్‌‌ కూడా చేస్తుండేది. అదే టైంలో మనీష్ కూడా ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో తన వీడియోలు పోస్ట్ చేసేవాడు. అలా ఒక ఇన్‌‌స్టా పోస్ట్‌‌ వల్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత చాలారోజులు స్నేహితులుగా ఉన్నారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. దాదాపు మూడేండ్లు రిలేషన్‌‌షిప్‌‌లో ఉన్నారు. 

ఫోన్‌‌లో మాట్లాడుకుంటుండేవాళ్లు. అప్పుడామె చదువుకోవడం కోసం హాస్టల్​లో ఉండేది. ఆ తర్వాత కరోనా టైంలో ఇద్దరి కుటుంబాలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. ఆ వెంటనే లాక్‌‌డౌన్‌‌ రావడంతో ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు యూట్యూబ్‌‌ మీద ఎక్కువ ఫోకస్‌‌ పెట్టారు. మంచి కంటెంట్‌‌తో వీడియోలు చేశారు. ఆ వీడియోలకు బాగా రీచ్‌‌ వచ్చింది. నెమ్మదిగా సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతూ పోయింది. 

నాన్నతో విడిపోయి.. 

సేన్‌‌శ్రీ వీడియోల్లో ఎంతో జాలీగా కనిపిస్తుంటుంది. కానీ ఆమె జీవితంలో చాలా విషాదం ఉంది. వీడియోలు చూసినవాళ్లలో చాలామంది ఆమె అమ్మానాన్నల గురించి అడిగేవాళ్లు. దాంతో ఆమెకి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే... సేన్‌‌శ్రీ అమ్మానాన్నలు ఆమె చిన్నప్పుడే విడిపోయారు. ఆమె తండ్రి ఎప్పుడూ తాగి ఇంటికొచ్చేవాడు. సేన్​శ్రీ తల్లితో గొడవపడేవాడు. 

మెడ పట్టుకుని కొట్టడం ఆమె కళ్లారా చూసింది. కొన్నిసార్లు సేన్‌‌శ్రీని కూడా కొట్టేవాడు. ఆ గొడవల వల్లే తల్లిదండ్రులు విడిపోయారు. అలా వాళ్లు విడిపోయినప్పుడు ఆమె తమ్ముడు కూడా దూరమయ్యాడు. అప్పటి నుంచి జీవితం మారిపోయింది. తల్లి కష్టపడి పనిచేసి ఆమెని చదివించింది. 

రెండు ఛానెల్స్‌‌ 

ఈ క్యూట్​ కపుల్​ మెయిన్ ఛానెల్‌‌ ‘‘మనీష్‌‌ విష్ణు” పేరుతో ఉంది. ఈ ఛానెల్‌‌ని 5.12 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు షార్ట్స్‌‌తో  కలిపి 805 వీడియోలు పోస్ట్‌‌ చేశారు. అయితే.. వీళ్లు అప్‌‌లోడ్‌‌ చేసిన పెద్ద వీడియోల కంటే షార్ట్‌‌ వీడియోలకే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. ఈ ఛానెల్‌‌లో 70 మిలియన్ల వ్యూస్ దాటిన షార్ట్‌‌ వీడియోలు కూడా ఉన్నాయి. 

ఇక ‘‘సేన్ శ్రీ001”  మరో ఛానెల్‌‌లో కూడా వీడియోలు పోస్ట్‌‌ చేస్తున్నారు. ఈ ఛానెల్‌‌కు1.98 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్నారు. ఈ ఛానెల్‌‌లో షార్ట్స్‌‌కి కూడా మంచి రీచ్‌‌ వస్తోంది. ఒక షార్ట్‌‌కి అయితే.. 51 మిలియన్ల వ్యూస్‌‌ వచ్చాయి. 20 మిలియన్ల వ్యూస్ దాటిన షార్ట్స్‌‌ ఈ ఛానెల్‌‌లో చాలానే ఉన్నాయి.