విశ్వాసం : కాలం తిరిగి రాదు

  • న హి తావదతిక్రాన్తా సుకరా కాచన క్రియా
  • అద్య దుఃఖం తు వైదేహీ వనవాసస్య వేత్స్యతి 

ఏ పని అయినా చేయి దాటి పోతే, దానిని మళ్లీ సరిచేయటం శక్యం కాదు. వనవాసంలోని కష్టాలను గురించి ఇటు పైన సీతకు అర్థం అవుతుంది. ఈ వనంలో జనసమ్మర్దం కానీ, పొలాలు కానీ, ఉద్యానవనాలు కానీ ఉండవు. మిట్ట పల్లాలు, లోతైన లోయలు ఉంటాయి. అటువంటి వనంలోకి సీత ఈ రోజు ప్రవేశిస్తోంది... అంటాడు రాముడు. 
 
(వాల్మీకి రామాయణం అయోధ్య కాండ, 52 వ అధ్యాయం 97 వ శ్లోకం)

కైకేయికి దశరథుడు ఇచ్చిన రెండు వరాలను సరైన సమయం చూసి కోరుకుంది కైకేయి. అదే మంచి తరుణం. ఆ సమయం మించిపోతే ఆమె మనసులోని కోరికలు నెరవేరవు. అందుకే రాముడు పదునాలుగు సంవత్సరాలు అరణ్య వాసం చేయాలని, భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరుకుంది. రాముడికి ఆ వివరాలను తండ్రి ఆజ్ఞగా నివేదించింది. తక్షణమే రాముడు అరణ్యాలకు బయలుదేరాడు. ఆయన వెంట సీత కూడా వస్తానంది. వద్దని వారించాడు. అడవులలో ఏ విధంగా కష్టపడవలసి వస్తుందో వివరించాడు. ఎన్ని మాటలు చెప్పినా సీత తన పట్టుదల విడిచిపెట్టలేదు.

సంపదలు ఉన్నా లేకున్నా, రాజ్యం ఉన్నా లేకున్నా, తాను రాముని వెన్నంటి ఉంటానని పలికింది. ఆ సందర్భంలో రాముడు లక్ష్మణునితో పైవిధంగా పలికాడు.ఏ పని అయినా చేయి దాటి పోతే, దానిని మళ్లీ సరిచేయటం శక్యం కాదు. అంటే సీతమ్మ అడవులలో ఉండలేను. వెనక్కి వెళ్ళిపోతానంటే అది కష్టం, కుదరదు అని సీతమ్మను హెచ్చరించాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సకాలంలో చేసిన పని చక్కని ఫలితాన్నిస్తుంది.. వంటి ఎన్నో సామెతలు రాముడు పలికిన ఈ మాటలకు పూర్తిగా సరిపోలినవి. 

అంతఃపురంలో ఉండే సీతమ్మకు అరణ్యాలు ఎలా ఉంటాయో తెలియదు. అక్కడి కష్టాల గురించి తెలియదు. అందుకే రాముడు ‘వనవాసంలోని కష్టాలను గురించి ఇటు పైన సీతకు అర్థం అవుతుంది’ అన్నాడు. అడవులలో జన సంచారం ఉండదు. పచ్చటి పొలాలు ఉండవు. మనస్సుకి ఆహ్లాదం కలిగించే తోటలు కూడా ఉండవు. మార్గం కూడా సాఫీగా ఉండదు. కొండలు, గుట్టలు, లోయలు.. ఇలా నడవడానికి అనువుగా ఉండదు. అందువల్ల సుకుమారి అయిన సీత ఈ అరణ్యవాసం తట్టుకోవటం కష్టమని అర్థం.

అందుకే రాముడు సీతమ్మను ముందుగానే హెచ్చరించాడు. ఒకసారి అరణ్యంలోకి ప్రవేశించిందంటే, అక్కడి కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలే కానీ, వెనుకకు మరలి రావటానికి కుదరదు. ఈ విషయాన్ని సూచించడానికే రాముడు ‘ఏ పని అయినా చేయి దాటి పోతే, దానిని మళ్లీ సరిచేయటం శక్యం కాదు’ అని ఆవిడకు తెలియపరిచాడు. 

ఈ సందర్భంగా పరీక్షిత్తును స్మరించుకోవాలి

పరీక్షిత్తు చేసిన తప్పు కారణంగా ఆయనకు వారం రోజుల్లో మరణం సంభవిస్తోందని తెలిసింది. ఈ వారం గడిచిందంటే తాను ఏమీ సాధించలేనని తెలుసుకుని ఆ వారం రోజులను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. శుక మహర్షిని రావించి, ఆయన ద్వారా భాగవత కథను విన్నాడు. మరణానికి సమీపంలో ఉన్న విషయం తెలుసుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలాగో పరీక్షిత్తు కథ ద్వారా తెలుస్తుంది.

సమయం చేయి దాటి పోతే, మళ్లీ తిరిగి రాదు కనుక సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాయి చీమలు. వేసవి కాలం, శీతాకాలం.. ఈ రెండు కాలాలలోనూ చీమలు అవిశ్రాంతంగా కష్టపడుతూ, ఆహారాన్ని సంపాదించుకుని నిల్వ ఉంచుకుంటాయి. వర్షాకాలంలో అవి బయటకు రాలేని సమయంలో, నిల్వ ఉంచుకున్న ఆహారాన్ని హాయిగా కడుపు నిండుగా తినగలుగుతాయి. ఇదే విషయాన్ని మానవులకు వర్తించుకోవాలని పెద్దలు చెబుతారు.

శరీరంలో జవసత్వాలు ఉన్న కాలంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకుని, సద్గ్రంథ పఠనం చేయమంటారు. అదేవిధంగా వృద్ధాప్యానికి సరిపడేంత ధనం కూడా కూడబెట్టుకోవాలని చెబుతారు. శక్తి సన్నగిల్లిన తరువాత సంపాదించలేక దారిద్య్రంతో బాధపడకుండా ఉండటం కోసమే ఇటువంటి మంచి మాటలు మనకు పెద్దలు చెబుతున్నారు.
 
చీమల్లాగే పక్షులు కూడా. వర్షాకాలం ఆసన్నమవుతుండగానే అవి గూళ్లు నిర్మించుకుంటాయి. ఎండాకాలం, శీతాకాలం చెట్ల మీద గడిపేస్తాయి. కాని వర్షాకాలం అవి తమ పిల్లలకు కూడా రక్షణ కల్పించే లక్ష్యంతో గూళ్లు నిర్మిస్తాయి.
 

మహాభారతం విషయానికి వస్తే

వ్యాస భగవానుని తల్లి అయిన సత్యవతి తన కోడళ్లు అయిన అంబికి, అంబాలికకు సంతాన ప్రాప్తి కలిగించమని వ్యాసభగవానుడిని ప్రార్థిస్తుంది. ఆ తరుణం మించిపోతే రాజ్యం అనాథ అయిపోతుందని ఆయనకు చెబుతుంది. 

అందుకే వాడకంలో ఒక మాట ఉంది...‘ఏ వయస్సుకి జరగవలసిన ముచ్చట ఆ వయస్సులో జరగాలి ..’ అని ‘బెండ కాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు’ అని...గడచిపోయిన ఒక్క తృటి కాలం కూడా తిరిగి రాదు. సమయాన్ని వృథా చేయకుండా, సమయానికి తగు పనులు చేయటం వల్ల విజయాలు చేకూరతాయని రామాయణంలో రాముని పలుకులద్వారా వాల్మీకి మానవజాతికి సందేశం ఇస్తున్నాడు.

- డా. పురాణపండ వైజయంతి