తండ్రిని దారుణంగా చంపిన యువకుడికి జీవిత ఖైదు

ఇబ్రహీంపట్నం, వెలుగు: గంజాయికి బానిసై తండ్రిని దారుణంగా పెట్రోల్ పోసి, బండరాయితో కొట్టి చంపిన యువకుడికి జీవిత ఖైదు పడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​కు చెందిన తిరుపతి రవీందర్ తుర్కయంజాల్‌లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో కొత్తగా ఇంటిని కొనుగోలు చేసి ఉంటున్నాడు. 

అతని పెద్ద కొడుకు అనురాగ్(25) గంజాయికి అలవాటు పడి, ఏ పని చేయకుండా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఏదో ఒక పని చేసుకోవాలని తండ్రి రవీందర్ పలుమార్లు మందలించాడు. దీంతో తండ్రిని చంపాలని ప్లాన్ వేసిన అనురాగ్ రెండు బాటిళ్లలో పెట్రోల్ కొని ఇంటికి తెచ్చాడు. 

గత ఏప్రిల్ 4న తన తల్లి బాత్​రూమ్​లో స్నానం చేస్తుండగా, ఆమె బయటకు రాకుండా గడియ పెట్టాడు. ఆపై అన్నం తింటున్న తండ్రి రవీందర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో బాధితుడు మంటలతో ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్ వెంట పరుగులు తీయగా, వెంటపడి మరీ మరలా ఇంకో బాటిల్​లోని పెట్రోల్ పోశాడు. మంటలకు తాళలేక బాధితుడు కిందపడగా, పెద్ద బండరాయి తల మీద వేసి అతిక్రూరంగా హత్య చేశాడు.  ఈ కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా, ఎల్బీనగర్ ప్రిన్సిపల్ జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించినట్లు ఆదిబట్ల సీఐ రాఘవేందర్​రెడ్డి తెలిపారు.