కేజ్రీవాల్ విచారణకు ఈడీకి అనుమతిచ్చిన ఎల్జీ

  • లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంక్వైరీ
  • అది అబద్ధమని కొట్టిపారేసిన ఆప్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతివ్వాలని ఈ నెల 5న ఈడీ లెటర్ రాయగా, అందుకు ఎల్జీ అంగీకరించారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ విచారణకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా, లిక్కర్ స్కామ్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. అయితే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో సెప్టెంబర్ లో జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో ప్రజాప్రతినిధులను విచారించాలంటే ఎల్జీ అనుమతి తప్పనిసరి అని కోర్టు చెప్పడంతో.. ఆ మేరకు ఎల్జీ నుంచి ఈడీ పర్మిషన్ తీసుకుంది.

పర్మిషన్ కాపీ ఏదీ?: ఆప్ 

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈడీ అబద్ధాలు చెబుతున్నదని ఆప్ మండిపడింది. కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు ఎల్జీ అనుమతిస్తే, ఆ కాపీ ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించింది. ‘‘ఇన్వెస్టిగేషన్ పేరుతో ఈడీ వేధింపులకు పాల్పడుతున్నది. ఆప్ ప్రభుత్వం, పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నది. ఈ కేసు విచారణను రెండేండ్లుగా సాగదీస్తున్నది. 500 మందిని వేధిస్తున్నది. 50 వేల పేజీల చార్జ్ షీట్లు ఫైల్ చేసింది. ఇప్పటి వరకు 250 రెయిడ్స్ చేసింది. కానీ అణాపైసా పట్టుకోలేదు” అని ఫైర్ అయింది. ‘‘ఎల్జీ అనుమతిస్తే, ఆ కాపీని బయటపెట్టడానికి ఈడీకి ఉన్న ఇబ్బందేంటి? ఇది ఫేక్ న్యూస్. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇట్ల చేస్తున్నారు” అని సీఎం ఆతిశి ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. అమిత్ షా ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు 
బీజేపీ ప్రయత్నిస్తున్నదని మనీశ్ సిసోడియా అన్నారు. కాగా, కేజ్రీవాల్ విచారణకు ఎల్జీ అనుమతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ పేర్కొంది.