Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..

పచ్చని అడవి.. ఆ అడవి మధ్యలో ప్రవహించే కృష్ణానది. ఆ నదిలో కలిసే మరో ఆరు నదులు, ఎత్తైన కొండలు. 'ఔరా!' అనిపించే సాగు భూములు. పచ్చిక బయళ్ల మధ్య గొర్రెలు, పశువులు మేపే రైతు కూలీలు. ఒకేచోట దర్శనమిచ్చే ద్వాదశ జ్యోతిర్లింగాలు. చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయుల కళావైభవాన్ని తెలిపే అపూర్వమైన శిల్ప సంపద.. పర్యాటకులకు ఇంతకంటే ఇంకేం కావాలి!? ఈ వేసవిలో ఈ ప్రకృతి యాత్ర చేయాల్సిందే మరి.

మనసు నిండా సంతోషం. కళ్లనిండా పచ్చదనం నింపే... ఇంత అందమైన ప్రాంతం ఎక్కడ అనుకుంటున్నారా..? మన రాష్ట్రంలోనే. నాగ ర కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలంలో ఉంది. సోమశిల. ‘సోమ' అంటే దేవుడికి సంబంధించిన పేరు. 'శిల' అంటే రాయి. ఈ పదాల వెనకున్న భావాలతో ఏర్పడింది సోమశిల. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురైన నూట పదిహేడు గ్రామాలలో ఇదీ ఒకటి. ఆ ఊళ్లలో దొరికిన విగ్రహాలను ఇక్కడే పునఃప్రతిష్ట చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూరు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరి చుట్టూ ఉన్న పచ్చని ప్రాంతం, ప్రాచీనమైన ఆలయాలు పర్యాటకులు కు, భక్తులకు కనులపండుగ చేస్తాయి.

ద్వాదశ జ్యోతిర్లింగాలు

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ముంపుకు గురైన గ్రామాల నుంచి 12 జ్యోతిర్లిం గాలను సేకరించారు. వాటన్నింటిని జీర్ణోద్ధరణ. చేసిన లలితా సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్టించారు. అందువల్లే సోమశిలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకేచోట దర్శనమిస్తాయి. కాకతీయుల కాలంలో వీటిని మొదటిసారిగా ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. అయితే వాళ్లకు నాలుగు స్వయంభు లింగాలు కనిపిస్తే. వాటికి మరికొన్నిచేర్చి పన్నెండు జ్యోతిర్లింగా లు ఇక్కడ ప్రతిష్ఠించారని చరిత్ర చెప్తోంది. సోమనాథ, రామలింగేశ్వర, భీమశంకర, శృణేశ, త్రయంబకేశ్వర, నాగేశ్వర, విశ్వేశ్వర, ఓంకారేశ్వర, కేదారేశ్వర. మహాకాళేశ్వర మల్లికార్జున, వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాలు

ఏడు నదుల కలయిక

ఒకటి కాదు రెండు కాదు సోమశిల దగ్గర ఏకంగా ఏడు నదులు కలుస్తాయి. కూడలి దగ్గర కృష్ణానదిలో తుంగభద్రానది కలుస్తుంది. అందుకే దాన్ని 'కూడలి సంగమేశ్వరం'' అని పిలుస్తారు. కృష్ణానదికి రెండు వైపులా పచ్చని దట్టమైన నల్లమల అడవి ప్రకృతి ప్రేమికుల మనసును కట్టిపడేస్తుంది. కృష్ణానది మీద ప్రయాణిస్తూ అడవిని చూడటం మరచిపోలేని అనుభూతినిస్తుంది. తుంగ, భద్ర, కృష్ణ, సంగమవేణి, మలపహరిణి, భీమాహారతి, భవనాశి నదులు ఇక్కడ కలుస్తాయి. అందుకే, దీనిని సప్తనదీ సంగమస్థానం అంటారు.

సూర్యుడు ఉదయించేటప్పుడు, ఆ కిరణాలు నదులపై పడి కనువిందు చేస్తాయి. అందుకే పర్యాటకులు ఇక్కడి సూర్యోదయాన్ని చూడడానికి మహబూబ్ నగర్, కర్నూలు నుంచే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడున్నాయి. సోమశిలకు వచ్చిన వాళ్లు ఈ లింగాలన్నింటిని ఒకేసారి దర్శించుకోవచ్చు. ఆయా పుణ్యక్షేత్రాలు తిరిగి అన్ని శివలింగాలను చూడలేని వాళ్లు.. ఇక్కడకు వచ్చి ఒకేసారి అన్నిం టిని దర్శించుకోవచ్చు. 

దేవాలయాలు

సోమశిలలో మొత్తం పదమూడు దేవాలయాలు ఉన్నాయి. తొమ్మిది గుళ్లు కలిసి ఒకటిగా, నాలుగు గుళ్లు కలిసి ఒకటిగా ఉన్నాయి. ఇవన్నీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు కాలంలో నిర్మించినవని పురావస్తుశాఖ పరిశోధ నల్లో తేలింది. అయితే, ఇక్కడున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనం.

ఇక్కడి విగ్రహాలను విజయనగర శిల్ప శైలిలో చెక్కించారు. ఇక్కడే. ఆంజనేయ స్వామి ఆలయం, లలితాదేవి గుడి కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు వెలుపల చెట్టు, పుట్ట, గ్రామదేవతలు, నాగదేవతల విగ్రహా లు ఉన్నాయి. భక్తులు వీటిని పసుపుకుంకాలతో పూజించి మొక్కుతారు. వీటికి దగ్గర్లోనే గంగ మృదేవత ఆలయం కనిపిస్తుంది. పెద్ద గంగమ్మ విగ్రహం దగ్గర భక్తులు దీపాలు వెలిగిస్తారు. తవ్వకాల్లో దొరికిన అనేక శాసనాలు, శిల్పాలు ఇక్కడ పర్యాటకుల సందర్శన కోసం ఏర్పాటు చేశారు.

బోటు షికారు.. భలే హుషారు

సోమశిల నుంచి కృష్ణానదిని చూస్తే.. మరింత అందంగా అడవి మధ్య పరుగెడుతున్న జలక న్యలా అనిపిస్తుంది. బోటులో షికారు చేస్తూ ఆ నది ఒంపులను, గలగలలను ఆస్వాదించొచ్చు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని బయళ్లని మనస్ఫూర్తిగా ఆస్వాదించొచ్చు. ఇక్కడ నుంచి బోటులో అరవై కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీశైలం చేరుకోవచ్చు. సుమారు రెండు నుంచి మూడు గంటలపాటు సాగే ఈ ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. కృష్ణలో స్నానం చేసేందుకు ఘాట్లు, విహారం చేయడానికి బోట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. బోట్లోనే నది చుట్టుపక్కలున్న అమరగిరి, సిద్ధేశ్వరం, సం గమేశ్వరం, దుర్గం గుహలు... లాంటి సుందర ప్రదేశాలకూ వెళ్లి రావచ్చు.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ నుంచి సోమశిల సుమారు 172 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ముందుగా కొల్లాపూర్కు వెళ్లాలి. అక్కడి నుంచి బస్సులు, ఆటోల్లో సోమశిల చేరుకోవచ్చు. కొల్లాపూర్ నుంచి సోమశిలకు 9 కి.మీ.ల దూరం, కొల్లాపూర్ చౌరస్తా నుంచి సరాసరి వెళ్తే సోమశిల వచ్చేస్తుంది. ఆ దారి సన్నగా వుంటుంది. కర్నూలు నుంచి వనపర్తి మీదగా సోమశిలకు వెళ్లొచ్చు. అలాగే మహబూబ్నగర్ నుంచి కొల్లాపూర్ మీదగా కూడా సోమశిల చేరుకోవచ్చు. వారాంతంలో వెళ్లాలనుకునే వారికి సోమశిల భక్తితోపాటు, ఆనందం, ఆహ్లాదాలను పంచుతుంది.