రేళ్లగడ్డ తండాలో చిరుత సంచారం..దాడిలో ఎద్దు మృతి

  • ఎద్దుపై దాడి చేసి చంపి తిన్న వైనం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేళ్లగడ్డ తండాలో చిరుత పులి సంచరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున తండాకు చెందిన మూడావత్‌‌ గోప్యా నాయక్ పొలంలో కట్టేసిన ఎద్దుపై దాడిచేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్​రాజేందర్, బీట్ ఆఫీసర్ కాశయ్య బృందం, యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

పొలంలోని పాద ముద్రలను పరిశీలించి చిరుతపులిగా నిర్ధారించారు. బాధిత రైతుకు ప్రభుత్వ తరఫున సాయం చేస్తామని అటవీశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని, పొలాలు, బావుల వద్ద పశువులను కట్టేయొద్దని చెప్పారు. చీకటి పడిన తరువాత ఇంటి నుంచి బయటకు రావద్దని తెలిపారు.