4 ప్రాజెక్టుల్లో రబ్బర్​ డ్యామ్స్​?

  • కొరియా టెక్నాలజీ వాడాలని సర్కారు యోచన
  • మంత్రి ఉత్తమ్, అధికారులకుకొరియా సంస్థ యూయిల్​ ప్రజెంటేషన్​
  • సాఫ్ట్​లోన్స్​ కింద ప్రాజెక్టులుచేపట్టాలని మంత్రి ప్రతిపాదన
  • ఏదుల–డిండి లింక్​లో రబ్బర్​డ్యామ్​ నిర్మాణం
  • రోళ్లవాగు సీపేజీ సమస్యకు దానితోనే చెక్​
  • మూసీ ప్రాజెక్టు, మంజీరా ప్రాజెక్టులోనూ టెక్నాలజీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల్లో రబ్బర్​ డ్యామ్​ టెక్నాలజీని వాడుకోవాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. ఏదుల రిజర్వాయర్​నుంచి డిండి లిఫ్ట్​ స్కీమ్​కు తరలించే ప్రాజెక్టులో భాగంగా పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్​ డ్యామ్​ను నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతోపాటు రోళ్లవాగు వద్ద సీపేజీ సమస్య అధికంగా ఉండడంతో దానిని అరికట్టేందుకూ ఈ టెక్నాలజీనే వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అలాగే, మూసీ, మంజీరా ప్రాజెక్టుల్లోనూ రబ్బర్​ డ్యామ్​లను నిర్మిస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. 

దీనికి సంబంధించి కొరియా టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా బుధవారం ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి, ఇరిగేషన్​ శాఖ అధికారులకు కొరియాకు చెందిన యూయిల్​ అనే సంస్థ ప్రజెంటేషన్​ ఇచ్చింది. అయితే, సాఫ్ట్​లోన్స్​ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టాల్సిందిగా కొరియా సంస్థ ముందు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. 

అంటే తొలుత సంస్థనే పెట్టుబడులు పెట్టి రబ్బర్​ డ్యామ్​లను నిర్మిస్తే.. ఆ తర్వాత 10 లేదా 20 ఏండ్లపాటు డిపార్ట్​మెంట్​నుంచి నెలవారీగా సంస్థకు పేమెంట్లు చేసేలా ఈ ప్రాజెక్టులను చేపట్టాలన్న ప్రపోజల్​ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉత్తర​ ప్రదేశ్, కర్నాటకలాంటి రాష్ట్రాల్లో కట్టిన రబ్బర్​డ్యామ్​లను పరిశీలించి ఆ తర్వాత దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

మేడిగడ్డ ఎగువన రబ్బర్​డ్యామ్​?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నీటి లిఫ్టింగ్​ ఆగిపోయింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 17 కిలోమీటర్ల దూరంలో జియోబ్యాగ్స్​ వేసి, నీటిని మళ్లించి ఎత్తిపోయాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. అక్కడ కూడా రబ్బర్​ డ్యామ్​ కడితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్టు తెలిసింది. అధికారులు మాత్రం అక్కడ కాజ్​బండ్​ను నిర్మిస్తే రూ.8 కోట్లలో పూర్తవుతుందని, ఖర్చు తగ్గుతుందని చెబుతున్నట్టు తెలిసింది.  

భూసేకరణ, ఖర్చు తక్కువ 

రబ్బర్​ డ్యామ్​లతో ప్రయోజనాలు ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. ఇతర పద్ధతులతో పోలిస్తే సులభంగా దానిని నిర్మించొచ్చని అంటున్నారు. తక్కువ ఖర్చు, భూసేకరణ ఎక్కువగా లేకుండా పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. రబ్బర్​ డ్యామ్​లలో రెండు రకాలుంటాయని తెలిపారు. ఒకటి గాలిని నింపి చేపట్టే రబ్బర్​ డ్యామ్​లు కాగా.. రెండోది నీటిని నింపి చేపట్టేవి. డిజైన్లను బట్టి నీళ్లు లేదా గాలితో నింపే వాటిని వాడుతుంటారు. 

ఇందులో భాగంగా డ్యామ్​ను నిర్మించాలనుకున్న ప్రాంతంలో ఫౌండేషన్​కు పటిష్టంగా ఉండేలా రబ్బర్​తో చేసిన ట్యూబ్​ల వంటి నిర్మాణాలను అటాచ్​ చేస్తారు. సదరు ప్రాంతంలో నది లేదా చెరువుల సామర్థ్యాన్ని బట్టి డ్యామ్​ ఎత్తు/పరిమాణాన్ని నిర్ధారిస్తారు. వాటర్​ హైడ్రో స్టాటిక్  ప్రెజర్​ (నీటి ప్రవాహ వేగంతో ఏర్పడే)  ఒత్తిడి ఆధారంగా ఈ రబ్బర్​ డ్యామ్​లు ఆటోమేటిక్​గా పనిచేస్తుంటాయి. తక్కువ టైంలో పూర్తవ్వడమేగాక తక్కువ ఖర్చు, సులభమైన నిర్వహణ, తక్కువ కరెంట్​ ఖర్చులతోపాటు భూకంపాలను తట్టుకునేలా ఈ నిర్మాణాలు ఉంటాయని చెబుతున్నారు. 

మున్నేరు– పాలేరు లింక్​కు లీకేజీలు

మున్నేరు నుంచి పాలేరు లింక్​ కెనాల్​కు లీకేజీలు ఏర్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయంపైనా మంత్రి ఉత్తమ్​ వద్ద చర్చించినట్టు తెలిసింది. వాటి రిపేర్ల పనులకు రూ.200 కోట్ల దాకా ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. దీనిని పూర్తిచేస్తే గ్రావిటీతో పాలేరుకు నీళ్లు ఇవ్వొచ్చంటున్నారు. 

అయితే, ప్రస్తుతం తయారు చేసిన అంచనాల్లో కొన్ని కరెక్షన్స్​ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. భూసేకరణ ఖర్చు ఎక్కువ అవుతున్నదని, దానిపై ఓసారి రివిజన్​ చేయాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. లింక్​ కెనాల్​కు లైనింగ్​ చేస్తే భూసేకరణ తగ్గి, ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మార్పులకు తగ్గట్టుగా ఎస్టిమేట్స్​ను అప్​డేట్​ చేయాలని సూచించినట్టు తెలిసింది.