మార్కెట్ వాటా కాపాడుకోవడానికి హెచ్‌యూఎల్ వ్యూహం
ముడి సరుకుల ధరల తగ్గుదలను కస్టమర్లకు అందిస్తున్నామంటూ ప్రకటన
న్యూఢిల్లీ : లక్స్, లైఫ్‌బాయ్, డోవ్ సబ్బుల ధరలను హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) గత నెల రోజుల్లో తగ్గించింది. ముడి సరుకుల ధరలు తగ్గడంతో, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకే ధరలను తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లో పోటీ ఎక్కువవడంతోపాటు, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ఈ తగ్గింపు సేల్స్ పెంపుదలకు సాయపడుతుందనేది కంపెనీ ఆలోచన. కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తుల ధరలలో హెచ్‌యూఎల్ వ్యూహాత్మక మార్పులు చేసింది. ముడి సరుకుల ధరల తగ్గుదల మరికొంత కాలం కొనసాగుతుందనే ఉద్దేశంతో లక్స్, లైఫ్‌బాయ్ పోర్ట్‌ఫోలియో ధరలను 4 నుంచి 6 శాతం దాకా తగ్గించినట్లు కంపెనీ వెల్లడించింది. కొన్ని ప్యాక్‌ల ధరలైతే ఏకంగా 20–30 శాతం తగ్గాయి. ఇండియాలో సబ్బుల మార్కెట్ విలువ రూ. 20,960 కోట్లైతే, ఇందులో లైఫ్‌బాయ్,లక్స్ సబ్బుల అమ్మకాలు బాగా ఎక్కువని రిసెర్చ్ సంస్థ యూరోమానిటర్ తెలిపింది. ఈ రెండు సబ్బుల నుంచి గణనీయమైన రెవెన్యూనే హెచ్‌యూఎల్‌కి సమకూరుతోంది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే సబ్బుగా, ఎక్కువ ఇళ్లను చేరుకున్న బ్రాండ్‌గా లైఫ్‌బాయ్ పేరొందిందని రిసెర్చర్ కంటార్ తెలిపారు.
కొత్తగా నేచురల్ ప్రొడక్ట్స్…
జూన్ క్వార్టర్లో హెచ్‌యూఎల్ కొత్తగా లక్స్ బొటానికల్స్, పియర్స్ నేచురలె ప్రొడక్ట్స్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. నేచురల్స్ కేటగిరీ ప్రొడక్ట్స్ పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలోనే కంపెనీ ఈ చొరవ తీసుకుంది. ప్యాకేజ్డ్ కన్స్యూమర్ గూడ్స్ డిమాండ్ తగ్గుతున్న తరుణంలో హెచ్‌యూఎల్ ధరల తగ్గించే వ్యూహానికి పదును పెడుతోంది. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో సాల్టీ శ్నాక్స్, బిస్కట్స్, మసాలా దినుసులు, టాయిలెట్ సబ్బులు, ప్యాకేజ్డ్ టీ వంటి ప్రొడక్ట్స్ అమ్మకాలు తగ్గాయని రిసెర్చ్ సంస్థ నీల్సన్ డేటా వెల్లడిస్తోంది. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగంలో హెచ్‌యూఎల్ కూడా చెప్పుకోదగ్గ వృద్ధి సాధించలేకపోతోంది. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో ఈ విభాగం సేల్స్ కేవలం 4 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. సబ్బుల అమ్మకాల పరిమాణం, పామాయిల్ ధరల కదలికల ప్రకారం చూస్తే హెచ్‌యూఎల్ ధరల తగ్గింపు నిర్ణయం వ్యూహాత్మకమైనదేనని ఎడెల్‌వీస్ ఎనలిస్ట్ అబ్నీష్ రాయ్ అభిప్రాయపడ్డారు. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఓవైపు సబ్బుల ధరలు తగ్గించిన హెచ్‌యూఎల్ మరోవైపు పియర్స్, డోవ్, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్‌లీ బ్రాండ్ ఫేస్ వాషెస్ ధరలను 4 నుంచి 14 శాతం దాకా పెంచడమని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ పేర్కొంది.
సబ్బులే పెద్ద కేటగిరీ…
పర్సనల్ కేర్ విభాగంలో సబ్బులదే పెద్ద కేటగిరీ. ఇండియాలో చాలా ఇళ్లలో సబ్బులు ఎక్కువగానే వాడుతున్నారు. డోవ్, పియర్స్, ఆయుష్, లక్స్ సబ్బులకు ప్రత్యర్ధి కంపెనీల బ్రాండ్స్ నుంచి గట్టిపోటీయే ఎదురవుతోంది. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, విప్రో కన్స్యూమర్ కేర్, ఐటీసీ లిమిటెడ్‌ల సబ్బులు మార్కెట్లో హెచ్‌యూఎల్ బ్రాండ్స్‌కు ధీటుగా నిలుస్తున్నాయి. సబ్బుల విభాగంలో ధరల తగ్గింపు చేపడుతున్నట్లు ఇన్వెస్టర్ల కాన్‌కాల్‌లో హెచ్‌యూఎల్ అధికారులు వెల్లడించారు. హెచ్‌యూఎల్ టర్నోవర్‌లో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ విభాగం నుంచే 46 శాతం వస్తున్నట్లు తాజా యాన్యువల్ రిపోర్ట్ చెబుతోంది. ప్రత్యర్థి కంపెనీల బ్రాండ్‌ల నుంచి లైఫ్‌బాయ్, లక్స్ బ్రాండ్‌లు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మార్కెట్ వాటా నష్టపోకుండా ఉండేందుకు హెచ్‌యూఎల్ వ్యూహాత్మకంగా వాటి ధరలు తగ్గించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ నవీన్ త్రివేది చెప్పారు.
