గద్వాల, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాలపై నాయకులు రాజకీయం చేస్తున్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన సెంటర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు విమర్శలున్నాయి. పేరుకు ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నా.. లీడర్లే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. వడ్ల కొనుగోళ్లలో వచ్చే కమీషన్‌తో పాటు రైతులను తరుగు పేరిట దోపీడీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆఫీసర్లతో పాటు సంఘం నేతలకు కమీషన్‌లో కొంత ఇచ్చి మేనేజ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతిఏటా ఇలాగే జరుగుతున్నా వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాల సభ్యులు, రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 74 సెంటర్లు ఏర్పాటు..
వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వడ్లను కొనేందుకు గద్వాల జిల్లాలో అధికారులు 74 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా సంఘాల సభ్యుల కోసం 45 సెంటర్లను కేటాయించారు. అర్బన్ ఏరియాలో మెప్మా ఆధ్వర్యంలో మూడు, మిగతా సెంటర్లు ఐకేపీ ఆధ్వర్యంలో నడపాలని గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్న అనేక సెంటర్లను మహిళా సంఘాల ముసుగులో లీడర్లు నడుపుతున్నట్లు తెలిసింది. కొనుగోలు కేంద్రానికి వచ్చిన మహిళా సంఘ సభ్యులకు, గ్రూప్ లీడర్లకు రోజువారిగా కొంత అమౌంట్ ఇచ్చి కమీషన్ మొత్తం లీడర్లే దోచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తరుగు పేరుతో దోపిడీ..
అధికారులను మేనేజ్ చేసి తూకం, తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. బస్తాకు ఒక కేజీ తరుగు తీయాల్సి ఉండగా రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు తరుగు తీస్తున్నారు. ఈ లెక్కన క్వింటాల్ వడ్లకు 6 కేజీలకు పైగానే తరుగు తీస్తున్నారు. వారం రోజుల కింద ధరూర్ మండలం నెట్టెంపాడు విలేజ్ లో 250 క్వింటాళ్ల లారీ లోడులో 14 క్వింటాళ్ల తరుగు తీశారని రైతు నర్సింలు ఆరోపించారు. తరుగు పేరిట అదనంగా తీసుకున్న వడ్లను అమ్ముకుంటున్నారనే విమర్శలున్నాయి.
సెంటర్ల కోసం తీవ్ర పోటీ..
ఐకేపీ సెంటర్లను నిర్వహించేందుకు గ్రామాల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. తమ వర్గానికి చెందిన మహిళా సంఘానికి కొనుగోలు కేంద్రం ఇవ్వాలని గ్రామాల్లోని లీడర్లు పోటీ పడుతున్నారు. ఇటీవల గద్వాల మండలం బీరెల్లి గ్రామంలో మొదట నెహ్రూ మహిళా సంఘానికి కేంద్రాన్ని కేటాయించారు. ఆ తరువాత గ్రూప్ రాజకీయాలు చోటు చేసుకోవడంతో పూజ మహిళా సంఘానికి కేటాయించారు. ఏకంగా ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, పోలీసులు వెళ్లి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ధరూర్ మండలం భీంపురం ఐకేపీ సెంటర్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇక్కడ కూడా రెండు వర్గాలకు చెందినవారు సెంటర్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. భీంపురం గ్రామాభివృద్ధి సంఘానికి కేటాయించాలని తాము తీర్మానం చేసినప్పటికీ, ఏపీఎం, క్లస్టర్ సీసీ ఇతరులకు కేటాయించారని మహిళా సంఘ సభ్యులు ఆరోపించారు.
ఎంక్వైరీ చేస్తాం..
కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ తరుగు తీస్తున్న విషయంపై దృష్టి పెడతాం. మహిళల ముసుగులో లీడర్లు నడుపుతున్న విషయం మా దృష్టికి రాలేదు. సెంటర్లపై వస్తున్న ఆరోపణలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం.
- నర్సింగరావు, డీఆర్డీవో, గద్వాల
తరుగు ఎక్కువ తీస్తున్నరు..
కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కువ తరుగు తీస్తున్నారు. మహిళలను నామ్‌కే వాస్తేగా పెట్టి లీడర్లే పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో తిప్పలు పడుతున్నాం.- నర్సింహులు, రైతు