పంచాయతీ పదవుల కోసం నేతల ఆరాటం

  • ప్రజల దృష్టిలో పడేందుకు సేవా కార్యక్రమాలు
  • విరివిగా విరాళాల అందజేత
  • లక్షల్లో ఖర్చు పెడుతున్న నాయకులు


మెదక్, కౌడిపల్లి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నాయకులు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. సర్పంచ్​ఆశావహులు ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపత్కాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదో తెలియదు కానీ కొందరైతే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు.  

జిల్లాలోని 21 మండలాల పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న 22 గ్రామ పంచాయతీలతో కలిపి మొత్తం 491 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 4,210 వార్డులు ఉన్నాయి. 2019లో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం గత ఫిబ్రవరితో ముగిసింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియ చేపట్టగా, ఇటీవలే ముసాయిదా ఓటర్ల జాబితా సైతం విడుదల చేసింది.

ఈ నెలాఖరులో తుది జాబితా విడుదల కానుంది. బీసీ ఓటర్ల గణన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాగా  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.  దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి గ్రామ స్థాయి రాజకీయ నాయకుల తోపాటు, పలువురు తటస్తులు సైతం సై అంటున్నారు.

ప్రజలకు దగ్గరయ్యేందుకు..

సర్పంచ్ ఆశావహులు ప్రజలకు దగ్గరయ్యేందుకు  వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూడడం, ప్రభుత్వం ఆఫీసుల్లో ఏవైనా పనులు ఉంటే వెళ్లి అధికారులతో మాట్లాడి చేయించడం, ఆలయాల నిర్మాణానికి, బోనాల  పండగ నిర్వహణ, వినాయక నవరాత్రి ఉత్సవాలకు, క్రీడా పోటీల నిర్వహణకు విరాళాలు ఇవ్వడం  చేస్తున్నారు.

కొందరు గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందో... ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి.

ఓటర్లు 5.14 లక్షలు

గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఇటీవల ప్రకటించారు. జిల్లాలోని 491 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 5,14, 725 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. ఇందులో మహిళలు అత్యధికంగా 2,66,756 మంది ఉండగా, పురుషులు 2,47,940 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను మండల పరిషత్ ఆఫీస్ లలో, గ్రామ పంచాయతీలలో ప్రదర్శించారు. అభ్యంతరాలు ఏమైనా వస్తే తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి ఈ నెల 28న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.