- గుట్టల్లో ఎందుకని నిరసనలు
- రియల్టర్ల కోసమేనని ఆరోపణలు
- టౌన్‌కు దగ్గర్లో కట్టాలని విధులు బహిష్కరిస్తున్న లాయర్లు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంపై వివాదం నెలకొంది. టౌన్ కు పది కిలోమీటర్ల దూరంలో పూడూరు శివారులోని అనంతపురం గుట్టల్లో కోర్టు నిర్మించడం ఏంటని పలువురు లాయర్లు అభ్యంతరం చెప్తూ నిరసనకు దిగారు. కోర్టును టౌన్‌కు దగ్గర్లోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో శనివారం వరకు విధులు బహిష్కరిస్తున్నట్టు లాయర్లు ప్రకటించారు.
కొంతమంది రియల్టర్ల మేలుకోసం .. కొందరు అడ్వకేట్ల పొలాలకు డిమాండ్ పెంచేందుకోసం కోర్టు కాంప్లెక్స్ కు అనంతపురం గుట్టల్లో స్థలాన్ని ఎంపిక చేశారన్న విమర్శలు వస్తున్నాయి. గద్వాల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 81 కోట్లు మంజూరయ్యాయి. ఒకే చోట 12 కోర్టులతో పాటు జడ్జిల నివాసాలు, బార్ అసోసియేషన్ బిల్డింగు, క్యాంటీన్, సీనియర్ అడ్వకేట్ల ఛాంబర్స్ ఈ నిధులతో నిర్మిస్తారు.
త్వరలో నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో స్థల ఎంపికపై వివాదం రాజుకుంది. కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ వ్యవహారంలో లాయర్ల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది పూడూరు శివారులోనే కోర్టు ఉండాలని చెప్తుండగా.. మెజారిటీ లాయర్లు మాత్రం గద్వాలకు దగ్గరలో ఉన్న పీజేపీ స్థలంలో కానీ, మెడికల్ కాలేజీ దగ్గర కానీ కోర్టు నిర్మించాలని వాదిస్తున్నారు.
ఎమ్మెల్యేను కలిసిన లాయర్ల బృందం
కోర్టు స్థల ఎంపికకు సంబంధించి గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రఘురామి రెడ్డి, షఫీ ఉల్లా ఆధ్వర్యంలో ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహరెడ్డి ని కలిశారు. పీజేపీ క్యాంపులోనే కోర్టు కోసం స్థలం కేటాయించాలని కోరారు. వారి అభ్యర్థన పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
శనివారం నాడు కలెక్టరేట్ దగ్గర, మెడికల్ కాలేజీ దగ్గర మిగిలి ఉన్న స్థలాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కోర్టును అనంతపురం గుట్టల్లో కడితే అందరికీ ఇబ్బందులు వస్తాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురాం రెడ్డి అన్నారు. అందరికీ అనుకూలమైన స్థలంలో కోర్టు ఉండాలని, స్థలాన్ని మార్చే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.