లాయర్ల నిరసన దీక్షల విరమణ 

గద్వాల, వెలుగు: గద్వాల కోర్టు కాంప్లెక్స్ స్థల వివాదానికి సంబంధించి 14 రోజులుగా లాయర్లు చేస్తున్న నిరసన రిలే దీక్షలు మంగళవారం విరమించారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న లాయర్లను ఉద్దేశించి హైదరాబాద్ నుంచి ఫోన్‌‌‌‌‌‌‌‌లో నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మాట్లాడారు. కోర్టు కాంప్లెక్స్ స్థల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ప్రజాభిప్రాయ ప్రకారం వేరే చోట కట్టాలని వినతిపత్రం ఇవ్వడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

ప్రజా, కుల, స్టూడెంట్, ఉద్యోగ సంఘాలతో పాటు, అఖిలపక్ష లీడర్ల అభిప్రాయం మేరకు కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుందని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. తొందరలోనే కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమై స్థల చర్చలు జరుపుదామని అన్నివర్గాల అభిప్రాయం మేరకు నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా చేస్తున్న దీక్షలను విరమిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రఘురాం రెడ్డి, ఉపాధ్యక్షుడు ఖాజా మైనుద్దీన్ ప్రకటించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ, ఏఐసీసీ సెక్రటరీ, అన్ని రాజకీయ పార్టీల లీడర్లకు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.