కోర్టు కాంప్లెక్స్ స్థలాన్ని మార్చాలి : రఘురాంరెడ్డి

గద్వాల, వెలుగు: ఇంటిగ్రేటెడ్  కోర్టు కాంప్లెక్స్  నిర్మాణ స్థలాన్ని మార్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బార్  అసోసియేషన్  అధ్యక్షుడు రఘురాంరెడ్డి తెలిపారు. పట్టణంలోనే ఎక్కడైనా కోర్టు కాంప్లెక్స్  నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్  చేస్తూ లాయర్లు బుధవారం నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్వాల పట్టణానికి దూరంగా అనంతపురం గుట్టల్లో కోర్టు కాంప్లెక్స్  నిర్మాణాన్ని చేపడితే కక్షిదారులకు, ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్నారు. పీజేపీ దగ్గర ఉన్న స్థలంలో కోర్టు కాంప్లెక్స్  నిర్మించాలని డిమాండ్  చేశారు. అప్పటివరకు నిరసన దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొందరు స్వార్థం కోసం వేరే చోట కోర్టు కాంప్లెక్స్  నిర్మించాలని డిమాండ్  చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్  నాయకుడు కలీం, బీఆర్ఎస్  లీడర్లు, గద్వాల ఇండియన్  మెడికల్  అసోసియేషన్  ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.