ఏపీలో వర్ష బీభత్సం.. అల్లూరి ఏజెన్సీలో విరిగిపడ్డ కొండచరియలు

 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని ఇళ్లు నేల మట్టం అయ్యాయి. ఇదిలా ఉండగానే.. తాజాగా మరోసారి ఏపీలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‎లో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. వరుణుడి బీభత్సానికి అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీ ఏరియాలోని జీకే వీధి మండలం చట్రాపల్లిలో ఇవాళ (సెప్టెంబర్ 9) కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు గిరిజనుల ఇళ్లు ధ్వంసం కాగా.. ప్రమాదంలో మరి కొందరు గల్లంతయ్యారు. 

వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు నలుగురిని కాపాడారు. మరోవైపు సీలేరు ఘాట్ రోడ్డులోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఏజెన్సీ ఏరియాలో కొండచరియలు విరిగిపడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొండచరియలు విరిగిపడిన చట్రాపల్లికి రెవెన్యూ అధికారులను పంపించామని ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. స్థానిక డిప్యూటీ తహశీల్దార్, ఎంపీడీవో, ఏఎస్పీతో మాట్లాడానని.. అధికారులను వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సూచించానని పేర్కొన్నారు. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతోన్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.