తగిన పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేయొద్దు: సుప్రీంకోర్టు

  • ఆస్తి హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ఆస్తి హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తగిన పరిహారం చెల్లించకుండా ఎవరి నుంచీ ఆస్తులను ప్రభుత్వాలు సేకరించొద్దని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బెంగళూరు–మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ (బీఎంఐసీపీ) కోసం కర్నాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) చేసిన భూసేకరణ అంశంపై ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది. 

ఈ ప్రాజెక్టు కోసం కేఏఐడీబీ 2003, జనవరిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత 2005 నవంబర్ లో సంబంధిత భూములను స్వాధీనం చేసుకుంది. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో 2011 నాటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వాలని 2019 ఏప్రిల్​లో స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్​ నిర్ణయించారు. దీనిని సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే..  

ఈ కేసులో బాధితులకు 22 ఏండ్లుగా న్యాయం దక్కకపోవడంపై సుప్రీంకోర్టు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజ్యాంగం (44వ సవరణ) చట్టం, 1978 ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300–ఏ ప్రకారం ఆస్తి హక్కును రాజ్యాంగ హక్కుగా, మానవ హక్కు అంశంగానే పరిగణించాలి. 

ఏ వ్యక్తి నుంచీ చట్టబద్ధంగా రక్షణ ఉన్న ఆస్తిని లాక్కోరాదు. 2003 నాటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారమే పరిహారం ఇస్తామనడం రాజ్యాంగ నిబంధనలను అపహాస్యం చేయడమే. అందుకే ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు విశేషాధికారాలను వినియోగిస్తూ ఈ కేసులో ఆదేశాలు జారీ చేస్తున్నాం” అని బెంచ్ వివరించింది.