- డాక్యుమెంట్లు ఇస్తలేరు.. మీటింగ్ లకు వస్తలేరు !
- ఐదురోజులుగా ట్రిపుల్ ఆర్ పై భూ బాధితుల నిరసన
- అవార్డ్ మీటింగ్‌ల బహిష్కరణ.. ఆఫీసుల ఎదుట ఆందోళన
- మార్కెట్ రేటుకు ‘అవార్డ్’ నిర్ణయించాలంటూ డిమాండ్
యాదాద్రి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) అవార్డ్ మీటింగ్‌లకు రైతులు వస్తలేరు. వచ్చిన చోట్ల బహిష్కరిస్తున్నారు. పట్టాదారు పాస్‌బుక్స్, ఖాళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ పేపర్లు, వ్యక్తిగత వివరాలను కూడా ఇస్తలేరు. పైగా అలైన్మెంట్ మార్చాలని కొన్ని చోట్ల డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ రేట్ మేరకు భూముల రేట్లు పెంచి అవార్డ్ ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ఆర్ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమై మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌లో ముగుస్తుంది. 164 కిలోమీటర్ల రోడ్డుకు కావాల్సిన భూ సేకరణలో భువనగిరి‘కాలా’ పరిధిలోని 490 ఎకరాలకు మినహా మిగిలిన భూమికి రిజిస్ట్రేషన్ విలువను రెండు నుంచి మూడు రెట్లు ప్రభుత్వం పెంచింది. ఖాళీ ప్లాట్లకు 90 శాతానికి విలువ పెంచి, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ధరణిలో ప్రభుత్వం అప్లోడ్ చేసింది. ఇప్పటికే ఎక్కువగా ఉన్న భూముల రేట్లను సవరించలేదు. ఈ రేట్లను నేషనల్ హైవే అథారిటీ ఆమోదిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణయించిన రేటుకు మూడు రెట్ల అవార్డు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో రెండు రెట్లను రైతులకు అందిస్తారు.
మీటింగ్‌లోనే వివరాలు సేకరణ
భూ సేకరణకు అడిషనల్కలెక్టర్, ఆర్డీవోలతో ఏర్పాటు చేసిన ఆరు ‘కాలా’లకు సంబంధించి త్రీజీ నోటిఫికేషన్ గతంలోనే రిలీజ్ అయింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అవార్డ్ మీటింగ్‌లను నిర్వహించారు. ట్రిపుల్ఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి ‘కాలా’ల త్రీజీ నోటిఫికేషన్లు తాజాగా రిలీజ్ చేసింది. ఈ ప్రక్రియ అనంతరం భూమిని కోల్పోతున్న రైతులు అవార్డ్ మీటింగ్‌కు హాజరై పట్టాదారు పాసు బుక్స్, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ పేపర్లు, అట్టి భూముల్లోని ఇతర వివరాలు అందించాలి. దీంతో పాటు ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్నంబర్ల జిరాక్స్‌లు ఇవ్వాలి. వీటిని తీసుకున్న తర్వాతే ‘ ఏ రైతు వద్ద ఎంత భూమిని సేకరిస్తున్నాం. ఆ భూముల్లోని నిర్మాణాల విలువ, చెట్లు, తోటలు. ‘అవార్డ్’ సొమ్ము ఎంతివ్వాలి. ఎవరి ఖాతాలో వేయాలి’ అనే విషయాలపై స్పష్టత వస్తుంది.
ఐదు రోజులుగా వస్తలేరు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాలా పరిధి వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో భూమి సేకరణపై అవార్డు మీటింగ్‌లు ఈనెల 21 నుంచి ఆర్డీవో శేఖర్రెడ్డినిర్వహిస్తున్నారు. భూముల కోల్పోతున్న వలిగొండ మండలం పొద్దుటూరు, రెడ్ల రేపాక, గోకారం, వర్కట్‌పల్లి, పహిల్వాన్పూర్, చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారం, చిన్నకొండూరు, తంగడపల్లి, నేలపట్ల, చౌటుప్పల్, లింగోజిగూడెం గ్రామాల అవార్డ్ మీటింగ్‌ను శుక్రవారం రైతుల బహిష్కరించారు. తహసీల్దార్ఆఫీసు ఎదుట ఆందోళన చేసిన అనంతరం హై వేపైకి చేరుకుని రాస్తారోకో చేశారు. భువనగిరి ఆర్డీవో ఆఫీసులో అవార్డ్మీటింగ్ను గౌస్‌నగర్ రైతులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. తహసీల్దార్ ఆఫీసు వద్దకు వచ్చి మీటింగ్‌కు హాజరుకాకుండా ఆందోళనలు చేశారు. అయితే మీటింగ్‌లకు రాకుండా భూముల పట్టాదారు పాసుబుక్స్, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వడంలేదు.
భూముల ధర పెంచాలి.. అలైన్ మెంట్ మార్చాలి
ఇప్పటికే పలు ప్రాజెక్టుల కోసం భూములను కోల్పోయినందున అలైన్మెంట్మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలైన్ మెంట్ లో మార్పు చేయాలని కేంద్ర మంత్రుల ను కలుస్తున్నారు. కొందరు రైతులు మాత్రం మార్కెట్‌కు అనుగుణంగా ధరలు పెంచి ‘అవార్డ్’ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఎకరానికి రూ. 70 లక్షల నుంచి నుంచి రూ. కోట్ల వరకూ ఉంటే.. ప్రభుత్వమిచ్చే రూ. లక్షలతో ఏం కొనుక్కో వాలని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రైతులు భూమికి భూమి ఇస్తేనే ట్రిపుల్ఆర్కు సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇంకొందరు రైతులు జాబ్ లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
డబుల్ బెంచ్‌కు బాధితులు
అలైన్మెంట్మార్చాలని రాయగిరికి చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు హైకోర్టు డబుల్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే గతేడాది హైకోర్టును ఆశ్రయించగా ఈనెల 3న కొట్టివేసింది. దీంతో రాయగిరికి చెందిన వారు డబుల్బెంచ్ను ఆశ్రయించారు. గ్రామ రైతుల నుంచి గతంలో ఐదుసార్లు భూమిని సేకరించారని, ఇప్పుడు ట్రిపుల్ ఆర్‌కోసం మళ్లీ తీసుకునేందుకు నోటీస్ జారీ చేశారని పిటీషన్లో పేర్కొన్నారు. కాగా భువనగిరి ఆర్డీవో ఆఫీసులో ఈనెల 26న ఎర్రంబెల్లి, 28న తుక్కాపూర్, 29న పెంచికల్‌పహాడ్, 30న రాయగిరి రైతులతో ఆర్డీవో అమరేందర్అవార్డ్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.