భూమి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు.. సిద్దిపేట సీడీపీవో ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట రూరల్, వెలుగు: భూమి ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితుడు సీడీపీవో ఆఫీస్ ముందు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మంగళవారం సిద్దిపేటలో జరిగింది. పొన్నాల గ్రామానికి చెందిన బాధితుడు నారాయణ కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని సీడీపీవో ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గా పనిచేసే శ్రీనివాస్ కొన్నేళ్ల కింద తనకు భూమి ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకున్నాడన్నారు. ఏళ్లు గడిచినా భూమి ఇప్పించకపోవడంతో  డబ్బులు ఇవ్వాలని కోరగా మధ్యవర్తుల సమక్షంలో రూ. 6 లక్షలు ఒప్పుకొని రూ. లక్ష రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. మిగతా రూ. 5 లక్షలు ఇవ్వమంటే ఇబ్బంది పెడుతుండడంతో అతడు పనిచేసే ఆఫీస్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.