మోహన్ బాబు, మనోజ్ గొడవలో ఎందుకు జోక్యం చేసుకోలేదో చెప్పేసిన మంచు లక్ష్మి..!

మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తాత్కాలికంగా సమసిపోయాయి. ఇంటి గొడవను వీధుల్లోకి తెచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని మంచు విష్ణుకు, మనోజ్కు పోలీస్ శాఖ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ గొడవల్లో పెద్దగా కనిపించని మంచు లక్ష్మి కూడా పనిలో పనిగా తమ్ముళ్లకు పరోక్షంగా ఉపదేశం చేసింది. ‘‘వాస్తవానికి ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు. అలాంటప్పుడు ఏదో కోల్పోయామని, కోల్పోతామని ఎందుకు భయపడుతున్నావ్..?’’ అని మార్కస్ ఆరేలియస్ అనే తత్వవేత్త చెప్పిన మాటను గుర్తుచేస్తూ మంచు లక్ష్మి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టింది.

ఆస్తి కోసం గొడవలకు దిగిన తన తమ్ముళ్లకు పరోక్షంగా హితబోధ చేస్తూ మంచు లక్ష్మి ఈ పోస్ట్ పెట్టి ఉండొచ్చని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మంచు కుటుంబంలో ఇప్పటిదాకా జరిగిన గొడవలో మంచు లక్ష్మి పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఒక్కరోజు జల్పల్లి ఫాంహౌస్కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబుతో, తమ్ముడు మనోజ్తో చర్చలు జరిపింది. ఈ గొడవ వీధిన పడుతుందని అర్థమైందో ఏంటో గానీ మౌనంగా పక్కకు తప్పుకుని హైదరాబాద్ వదిలి వెళ్లిపోయింది.

హైదరాబాద్లో ఉంటే తెలుగు మీడియా కంటపడే అవకాశం ఉందని, ముంబైలో అయితే ప్రశాంతంగా ఉండొచ్చని భావించి రాత్రికి రాత్రే ఆమె ముంబైకి వెళ్లిపోయినట్లు తెలిసింది. ముంబైలో కూడా మంచు లక్ష్మికి ఇల్లు ఉంది. గత కొంతకాలంగా కొన్నాళ్లు హైదరాబాద్లో, ఇంకొన్నాళ్లు ముంబైలో ఆమె ఉంటోంది. ముంబైలో మంచు లక్ష్మికి వ్యాపారాలున్నాయి. ఇక.. ఆస్తి పంపకాల విషయానికొస్తే.. మంచు లక్ష్మికి చెందాల్సింది అంతా మోహన్ బాబు ఇప్పటికే సెటిల్ చేసినట్లు సమాచారం. అందుకే.. ఈ గొడవల్లో తలదూర్చకూడదని ఆమె డిసైడ్ అయినట్లు టాక్.