నిర్జల ఏకాదశి.. జూన్​18న తులసి మొక్క దగ్గర ఇలా చేయండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..

నిర్జల ఏకాదశి.. తులసి మొక్కకు సంబంధం నిర్జల ఏకాదశి రోజు (జూన్​18) ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. నిర్జల ఏకాదశి రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన తులసిమొక్క వద్ద పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. నిర్జల ఏకాదశికి తులసిమొక్కకు ఉన్న సంబంధం ఏమిటి? ఆరోజు తులసిమొక్క వద్ద ఏమి చేయకూడదో తెలుసుకుందాం. 

హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. కొంతమంది నిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి అమ్మవారిని ఆవాహన చేసి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. తులసి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టు లో నివసిస్తున్నదని నమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేస్తుందని మార్కాండేయ పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు.  అందుకే ఏకాదశి రోజు తులసి మొక్కకు పొరపాటున కూడా నీళ్లు పోయకూడదని ఆధ్యాత్మిక వేత్తలు పలు ప్రసంగాల్లో వెల్లడించారు. 

నిర్జల ఏకాదశి ( జూన్​ 18)న తులసి మొక్క కుండీని   పసుపు కుంకుమతో అలంకరించండి. అలాగే గుమ్మాలను కూడా అలంకరించండి. ముందుగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి.  అమ్మవారితో పాటు.. విష్ణుమూర్తిని  ఆవాహన చేసి పూజ చేయండి.  అంగపూజ, అష్టోత్తర శతనామావళితో పూలు, కుంకుమతో పూజ చేయండి. తరువాత ధూప, దీప, నైవేద్యం ఇచ్చి.. హారతి ఇవ్వండి. అవకాశం ఉంటే తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి.  విష్ణు సహస్రనామం చదవండి.. లేక పోతే వినండి. ఆ రోజంతా భగవంతుని ధ్యానిస్తూ గడపండి.  దగ్గరలో విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి. ఓం నమో వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.  ఆరోజు కఠినమైన ఉపవాసం ఉండండి. కనీసం నీరు తాగకుండా భగవంతుని స్మరిస్తూ.. నిర్జల ఏకాదశి(జూన్​18)న ఉపవాసం చేస్తే 24 ఏకాదశుల ఉపవాసం పుణ్యం ఫలం వస్తుందని మార్కండేయ పురాణంలో రుషి పుంగవులు పేర్కొన్నారు. 

తులసి మొక్క వద్ద పాటించాల్సిన నియమాలివే

ఏకాదశి రోజున తులసి ఆకులను ఎప్పుడు తుంచకూడదు. తులసి ఆకులు ఎప్పుడు అవసరమైనా ఏకాదశి రోజు కాకుండా అంతకు ముందు రోజు మాత్రమే తుంచి పెట్టుకోవాలి. తులసి ఆకులను తుంచే క్రమంలో గోళ్లతో గిల్లడం మహాపాపం.  తులసి ఆకులు తుంచడానికి ముందు తులసి మొక్కకు నమస్కరించి మరీ తుంచాలి. మురికి చేతులతో లేదా మైల పడిన శరీరంతో, స్నానం చేయకుండా ఎప్పుడు తులసి ఆకులను తాకకూడదు. ఒక వేళ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ దేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. 

తులసి మొక్క పరిసరాలు ఇలా ఉండకుండా చూసుకోండి

 తులసి మొక్క ఉన్న చోట మురికి ఉండకుండా చూసుకోవాలి. తులసి మొక్క పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచాలి. నిర్జల ఏకాదశి  రోజు లక్ష్మీదేవి ఉపవాసం చేస్తుంది.  కాబట్టి అమ్మవారికి కనీసం నీళ్లను కూడా సమర్పించకూడదు.పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు, బూట్లు విప్పకుండా చూసుకోవాలి.  

హిందూమతంలో ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏకాదశిని హిందువులు పరమ పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో వస్తాయి. అయితే జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి జూన్ 18వ తేదీన వచ్చింది. నిర్జల ఏకాదశి అంటే కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేసే రోజు. 

లక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా, పరమపవిత్రంగా భావించే తులసి మొక్కను ఆ రోజు మంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. అందుకే నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఉపవాస దీక్షను ఆచరించి లక్ష్మీదేవిని పూజిస్తే నిర్జల ఏకాదశి విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.