డిసెంబర్ 13 నుంచి రాష్ట్ర స్థాయి లగోరి పోటీలు.. పాల్గొననున్న 33 జిల్లాల క్రీడాకారులు

వికారాబాద్, వెలుగు: ఈ నెల13 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ ఉప్పల్​లోని సృజన హై స్కూల్​వేదికగా రాష్ట్ర స్థాయి లగోరి పోటీలు నిర్వహిస్తున్నట్లు లగోరి అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు టి.సదానంద్​రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నవీన్​కుమార్​తెలిపారు. వికారాబాద్​జిల్లా కేంద్రంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు. బాలురు, బాలికల టీమ్స్​ఉంటాయని ఒక్కో టీమ్​లో 12 నుంచి 15 మంది క్రీడాకారులు ఉంటారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరంలో లగోరిని జాతీయ క్రీడగా గుర్తించిందని, జనవరి 21, 22, 23వ తేదీల్లో బిహార్​లో జాతీయ స్థాయి లగోరి పోటీలు ఉంటాయన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో లగోరి పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. స్కూల్​గేమ్స్​ఫెడరేషన్ లోనూ లగోరి పోటీలకు గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సర్టిఫికేట్​అందజేస్తామని, స్పోర్ట్స్​కోటాలో 5 శాతం రిజర్వేషన్ పొందొచ్చని వివరించారు. సమావేశంలో నాయకులు అమరేందర్​రెడ్డి, సాయికృష్ణ, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.