ధూమ్ సినిమా తరహాలో చోరీ

ధూమ్ సినిమా తరహాలో చోరీ

కర్నూల్: సినీ ఫక్కీలో దారిదోపిడీ చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. హైవేల పై వెళ్తున్న కంటెయినర్లను రన్నింగ్ లోనే ఈ ముఠా దోపిడీ చేస్తొన్న విషయం తెలుసుకొని చాలా తెలివిగా అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన కంజారా  గ్యాంగ్ లోని 10 మంది సభ్యులు ఈ సరుకుల కంటెయినర్లను రెండు బైకులు.. మరో రెండు ఖాళీ లారీలతో వెంబడించి దోపిడీ చేస్తున్నట్టు  పోలీసులు తెలిపారు.

ఈ నెల 4, 5, 6వ తేదీల్లో నంద్యాల, ఆళ్లగడ్డ హైవేలపై వెళ్తున్న DTC వరల్డ్ కార్గో కంటెయినర్ వాహనాన్ని కొందరు దుండగులు రన్నింగ్ లో ఉండగానే పల్సర్ వాహనాలపై వెంబడించారు. కట్టర్ ద్వారా తాళం తెరచి లోపలికి ప్రవేశించి, కంటెయినర్లోని మొబైల్ ఫోన్ల పార్శళ్లను ఒక్కొక్కటిగా  వారి వెంట తెచ్చుకున్న రెండు ఖాళీ లారీల్లోకి చేర్చారు. ముఠాలోని మరికొతమంది సభ్యులు ఈ పార్శిల్స్ ను కలెక్ట్ చేసుకుంటూ వెళ్లారు.

అయితే కర్నూలు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఫుల్ గా ఉన్న కంటైనర్.. మధ్యలో ఆళ్లగడ్డకు వెళ్లిన తర్వాత ఖాళీ కావడంతో డ్రైవర్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈనెల 26న కూడా హైదరాబాద్ –బెంగళూరు హైవేపై డోన్ కు సమీపంలో ఇలాంటి  దోపిడీనే జరిగింది.రెండూ దోపీడీలు ఒకేలా ఉండడంతో.. ఈ చోరీలు ఒకే ముఠా చేసిందని గుర్తించిన  పోలీసులు టెక్నాలజీ సహాయంతో ముఠా కాల్స్ ను ట్రేస్ చేశారు. వెల్దుర్తి సమీపంలోని ఓ దాబా వద్ద నిందితులు ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లేలోపే ఆ ముఠా సభ్యులు తప్పించుకున్నారు.

దీంతో వారిని వెంబడిస్తూ.. కొంత మంది పోలీసులు కర్నూలు వరకు రాగా… అలంపూర్ టోల్ ప్లాజా వద్ద మరికొంత మంది కాపు కాశారు. అయితే నిందితులు తెలివిగా.. నంద్యాల మార్గంలోకి వెళ్లిపోయారు.పోలీసులు వెంబడిస్తున్న విషయం గుర్తించిన గ్యాంగ్..  పాణ్యం సమీపంలో ఎస్.ఆర్.బి.సి కాలువ పక్కన లారీలను ఆపేసి కొండల్లోకి పరారయ్యారు. నిందితులంతా ఈ ప్రాంతానికి కొత్త వారు కావడంతో.. వారిని పట్టుకునేందుకు పోలీసులు వెంటనే పాణ్యం కు చెందిన చెంచు యువకుల సహాయం తీసుకున్నారు. ఓ చోట ఇద్దరు నిందితులు కాలువలో దూకి అవతలి ఒడ్డుకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. కాలువ లోతు.. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో వెనక్కు వచ్చి పోలీసులకు దొరికిపోయారు. వీరిని విచారించగా మొత్తం 10 మంది కర్నూలుకు వచ్చి దోపిడీలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.

పట్టుబడిన దొంగల ముఠా గుజరాత్, మహారాష్ర్ట, కర్నాటక, తెలంగాణ సహా మరికొన్ని రాష్ర్టాల్లో 100కు పైగా కేసులున్నట్లు గుర్తించామన్నారు. ఈ దోపిడీకి పాల్పడ్డ మిగతా వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న 100 మంది పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.