దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

  • గన్, 2 కత్తులు, 2 బైకులు,11 సెల్ ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్​సిటీ, వెలుగు : దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని కుల్సంపురా పోలీసులు అరెస్ట్​చేశారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్ కు చెందిన ఆర్.కృష్ణ(33) రోజువారి కూలీ. ఎప్పటిలాగే ఈ నెల 24న పనికి వెళ్లిన కృష్ణ సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా పురానాపూల్100 ఫీట్ రోడ్డులో పాతబస్తీకి చెందిన సయ్యద్ అబుల్ హసన్(32), సయ్యద్ తలేబ్ అలీ(23), సైఫ్ అలీ మీర్జా(19) కృష్ణను ఆపారు.

కత్తి, గన్​చూపించి బెదిరించారు. మొబైల్, బైక్ ను లాక్కొని ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కుల్సంపురా పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ముగ్గురిని అరెస్ట్​చేసి రిమాండుకు తరలించారు.

వారి నుంచి రెండు బైకులు, ఒక గన్, 2 కత్తులు, నకల్ పంచ్, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అబుల్ హసన్, సయ్యద తలేబ్ అలీపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు.