కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టింది: కేటీఆర్

కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం(ఫిబ్రవరి 25) నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు ఓటేశారన్నారు కేటీఆర్. ఇప్పుడు వస్తున్న ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవేనని.. కానీ మేము ఉద్యోగాలు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని.. తాము పూర్తి చేసిన పనులను కాంగ్రెస్ ప్రారంభిస్తోందన్నారు.

ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ ను హైదరాబాద్ లెవెల్లో అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కళకళలాడాయని.. 14 ఏండ్ల పాటు ఉద్యమంలో కారు దూసుకుపోయిందన్నారు. రాజకీయాల్లో గొలుపు ఓటములు సహజమని చెప్పారు. మనం కార్యకర్తలను కాపాడుకుంటే.. పార్టీని కార్యకర్తలు కాపాడుతరని కేటీఆర్ సూచించారు. 

తెలంగాణ తల్లి రూపం కూడా మార్చుతారట.. రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉండొద్దంటున్నారని కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి.. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు మరి ఆ హామీలు ఏమయ్యాయి అన్ని ప్రశ్నించారు. కృష్ణ జలాలపై మనకు ఉండే అధికారాలను కేంద్రానికి ధారదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏం చేసిందని నిలదీశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఏం చేయాలో వారికే అర్థం కావడం లేదన్నారు కేటీఆర్. అప్పుడేమో అందరికీ అన్నీ హామీలు ఇస్తామని.. ఇప్పుడేమో కొందరికి కొన్ని హామీలు అంటున్నారని విమర్శించారు. ఏమన్నా అంటే కేసీఆర్ ఖజానా కాళీ చేశాడని.. సెక్రటేరియట్ లో లంకెబిందెలు దొరకుతయని వచ్చానని కానీ ఇక్కడ ఖాళీ బిందెలే ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. రేవంత్ ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నాడా.. అతని పాత బుద్దులు అన్నీ మళ్లీ బయటకువస్తున్నాయని చెప్పారు. లంకె బిందెలు వెతికే వాళ్లను ఏమంటరో ప్రజలకే తెలుసన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని.. అధికారం వస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా కలగనలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని.. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతరు .. దొంగలు తిరుగుతరన్నారు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు.. 2 లక్షల రుణామాఫీ చేస్తామని చెప్పారని.. హామీలు ఎప్పటివరకు అమలు చేస్తారో మేము కూడా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్ దాడులను తిప్పికొట్టే సమయం ముందు ఉందని చెప్పారు.