రాముడ్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: కేటీఆర్

వికారాబాద్, వెలుగు:  శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని బీజేపీ లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదామని బీఆర్ఎస్​శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అధ్యక్షతన వికారాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. కేటీఆర్​తోపాటు ఎమ్మెల్యేలు సబితారెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, చేవెళ్ల బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడుతూ.. రాముడు అందరికీ దేవుడేనని, అయోధ్యలోని రామాలయాన్ని అందరం కలిసి నిర్మించుకున్నామని, బీజేపీ మాత్రమే ఆలయం కట్టలేదని చెప్పారు.

 మోదీ హవా నడుస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు ఎందుకు టికెట్ తెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని, యాక్టింగ్​లో వారిద్దరికీ ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనన్నారు. భవిష్యత్​లో పార్టీలోకి వస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, ప్రతి మహిళకు  నెలనెలా రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.  సబితారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కు వికారాబాద్ జిల్లాపై పూర్తి అవగాహన ఉందని, ప్రతి మీటింగులో వికారాబాద్ గురించి ఆరా తీస్తారని చెప్పారు. కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రాజుగౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయకుమార్, నాయకులు కార్తీక్ రెడ్డి, నాగేందర్ గౌడ్, కమల్​రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.