రైతులు డిక్లరేషన్ ఎందుకివ్వాలి..రైతు భరోసా ఎగ్గొట్టేందుకు సర్కారు కుట్ర: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ఆరోపించారు. డిక్లరేషన్ల పేరుతో రైతులపై కేసులు పెట్టేందుకు కుటిల ప్రయత్నాలకు తెరతీసిందని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. రైతన్నల నుంచి డిక్లరేషన్ అడగడానికి సిగ్గుండాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా లేకుంటే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

 డిక్లరేషన్​ ఇవ్వాల్సింది రైతులు కాదని.. ప్రభుత్వమే రైతులకు డిక్లరేషన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రప్రభుత్వానికి దమ్ముంటే రైతుభరోసాపై ప్రతి ఊర్లోనూ లబ్ధిదారుల జాబితాను పెట్టాలని సవాల్​ విసిరారు. కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చారో లేదో ప్రభుత్వం సెల్ఫ్​ డిక్లరేషన్​ ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ప్రజాపాలన అభయహస్తం పేరిట కాంగ్రెస్​ ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకున్నదని, అందులో రైతు భరోసా కూడా ఉందని గుర్తు చేశారు. 

కానీ, మళ్లీ ఇప్పుడు కొత్తగా రైతుభరోసాకు దరఖాస్తులంటూ డ్రామా మొదలుపెట్టారన్నారు. ఆరు గ్యారంటీల కోసం అని ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి 1.06 కోట్ల మంది నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారన్నారు. ఇప్పుడేమో ప్రతి పథకానికీ కొత్తగా దరఖాస్తులంటూ సర్కారు కాలయాపన చేస్తున్నదన్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయని దుష్ప్రచారం చేస్తున్న సర్కారు.. ఏ ఊర్లో ఎంత మందికి రైతుబంధును దుర్వినియోగపరిచారో ప్రతి ఊర్లో జాబితా పెట్టాలన్నారు.