అబద్ధపు హామీలతో ప్రజలందరినీ.. కాంగ్రెస్​ మోసం చేస్తున్నది: కేటీఆర్​

గద్వాల/కల్వకుర్తి/అచ్చంపేట, వెలుగు: ఆరు గ్యారంటీలు, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఐదు గ్యారంటీలు అమలు చేశామంటూ ఆ పార్టీ లీడర్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. బుధవారం నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్​లో కేటీఆర్ మాట్లాడారు. 

‘‘ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో మోదీని దొంగ అంటారు.. సీఎం రేవంత్ రెడ్డేమో బడే భాయ్ అంటారు.. అదానీని రాహుల్ ఫ్రాడ్ అంటే.. రేవంత్ రెడ్డేమో మా ఫ్రెండ్ అంటారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు లీడర్లు ఎక్కడైనా ఇట్ల మాట్లాడ్తారా? కాంగ్రెస్ లీడర్లంతా మోచేతికి బెల్లం పెట్టి.. గందరగోళం సృష్టిస్తున్నరు. రూ.2 లక్షల రుణమాఫీ అని, రూ.500 బోనస్ అని, కౌలు రైతులకు రైతుబంధు అంటూ హామీ ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం అంటూ హామీలిచ్చి గద్దెనెక్కాక పట్టించుకోవడం లేదు’’అని కేటీఆర్ అన్నారు.

ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ పడ్డరు

రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ నేతలంతా ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. తారీఖులు మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక లక్షా 50 వేల పెండ్లిళ్లు జరిగాయని, ఇక్కడి ఆడ బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా యాభై తులాల బంగారం బాకీ పడిందన్నారు. ‘‘బీజేపీకి పొరపాటున కూడా ఓటేయొద్దు. నమో అంటే.. నమ్మించి మోసం చేయడమే. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బులోంచి రూ.13 లక్షల కోట్లను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. జన్​ధన్ ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమైనయ్? ఎవరెవరికి రూ.15 లక్షలు వచ్చాయో వాళ్లే బీజేపీకి ఓటెయ్యాలి. రానివాళ్లంతా కారు గుర్తుకు ఓటేయ్యాలి. 

ప్రధాని మోదీ సర్కార్ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేదు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్​కు జాతీయ హోదా ఇవ్వలేదు. ప్రపంచ మార్కెట్​లో క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేదు’’అని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటని కాంగ్రెస్​ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే కవిత జైల్లో ఎందుకు ఉంటదని కేటీఆర్​ ప్రశ్నించారు. బీఆర్ఎస్​కు 12 ఎంపీ  సీట్లు ఇస్తే ఆరు నెలల్లోనే అధికారం కేసీఆర్ చేతిలోకి వస్తుందని చెప్పారు.