రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి రోషం పొడుసుకొస్తుంది: కేటీఆర్

ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఏం చేయాలో వారికే అర్థం కావడం లేదని.. కుడితిలో పడిన ఎలుకలగా కాంగ్రెస్ పరిస్థితి అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్పుడేమో అందరికీ అన్నీ హామీలు ఇస్తామని.. ఇప్పుడేమో కొందరికి కొన్ని హామీలు అంటున్నారని విమర్శించారు. ఏమన్నా అంటే కేసీఆర్ ఖజానా కాళీ చేశాడని.. సెక్రటేరియట్ లో లంకెబిందెలు దొరకుతయని వచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. రేవంత్ ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడుతున్నాడా.. అతని పాత బుద్దులు అన్నీ మళ్లీ బయటకువస్తున్నాయని చెప్పారు కేటీఆర్. 

రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి రోషం పొడుసుకొస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఇటుకలతో కొడితే.. తాము రాళ్లతో కొట్టే రోజులు కూడా దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని అనుకుంటే.. 30 సీట్లు కూడా రాకుండేనని కేటీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని.. అధికారం వస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా కలగనలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని.. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతరు .. దొంగలు తిరుగుతరన్నారు కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు.. 2 లక్షల రుణామాఫీ చేస్తామని చెప్పారని.. హామీలు ఎప్పటివరకు అమలు చేస్తారో మేము కూడా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్ దాడులను తిప్పికొట్టే సమయం ముందు ఉందని చెప్పారు. 

తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినమని చెప్పారు కేటీఆర్. కేసీఆర్, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామల్లో లక్షల మంది ఉన్నారన్నారు. మార్చి 17కు కాంగ్రెస్ ప్రభుత్వానికి వందరోజులు నిండుతాయి.. అప్పటివరకు ఆగుతామని తెలిపారు. కేసీఆర్ సీఎంగా  ఉన్నప్పుడు రైతుబంధు వెంటనే పడేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇంతవరకు ఉచిత కరెంట్ హామీ అతీగతీ లేదని.. ఎండాకాలం రాకముందే మంచినీటీ కొరత ఏర్పడుతోందని తెలిపారు కేటీఆర్. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.