ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.లోపలి వరకూ అనుమతించిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదర్శ నగర్​లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల యూనిఫాం ధరించి.. ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సం దర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు.

వారి కుటుంబాలను ప్రభుత్వం వెం టనే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తానన్న రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే ప్రక టించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా వారి యూనిఫాం ధరించి, ఆటోల్లోనే అసెంబ్లీకి వచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. దీంతో వారు అసెంబ్లీలోని ఎల్పీ ఆఫీసు వరకూ ఆటోల్లోనే వెళ్లారు.

ఫార్ములా ఈ-రేస్​పై చర్చ పెట్టాలె

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో ఫార్ములాఈ–రేస్​పై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై కాంగ్రెస్ సర్కార్ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. తన అరెస్టుకు గవర్నర్ ఆమోదం తెలిపారని, కేసులు నమోదు చేస్తారంటూ.. సీఎం ఆఫీసు నుంచి మీడియాకు లీకులు ఇస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెడితే నిజానిజాలేంటో ప్రజలకు తెలుస్తాయని అందులో పేర్కొన్నారు.