అదో లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం: కేటీఆర్​

  • ఫార్ములా-ఈ రేసు కేసుతో పెద్ద ఇబ్బందేమీ కాదు
  • దాని గురించి బీఆర్​ఎస్​ నేతలెవరూ ఆలోచించొద్దు
  • కార్యకర్తలంతా ఒక్కో కేసీఆర్​లామారి సర్కార్​పై పోరాడాలి
  • సైనికుడ్ని నేను.. ఈ కేసు నుంచితప్పకుండా బయటపడ్త
  • చూసుకోవడానికి మంచి లీగల్​ టీమ్​ ఉందని ధీమా
  • ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా పార్టీ అండగా ఉంటది: హరీశ్​రావు
  • కేటీఆర్​ కూడా ఒక కార్యకర్తనే.. ఆయనకుబీఆర్​ఎస్​ మొత్తం అండగా ఉంటదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు కేసుతో ఇబ్బంది ఏమీలేదని, భయపడాల్సిన అవసరం లేదని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తనపై పెట్టిన కేసు గురించి బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని, అది చూసుకోవడానికి మంచి లీగల్​ టీం ఉందని పేర్కొన్నారు. ‘‘మళ్లీ చెప్తున్నా.. ఇప్పుడున్న కేసు ఓ లొట్టపీసు కేసు. రేవంత్​రెడ్డి ఓ లొట్టపీసు సీఎం. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడ్ని నేను. కేసీఆర్​ రక్తం పంచుకుపుట్టిన కొడుకుని. ఈ అక్రమ కేసు నుంచి తప్పకుండా బయటపడ్త” అని వ్యాఖ్యానించారు.

బుధవారం తెలంగాణభవన్​లో బీఆర్​ఎస్​ పార్టీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్​ టీఆర్​ఎస్​ పార్టీని పెట్టి ఉద్యమాన్ని నడిపినప్పుడున్న ఇబ్బందులతో పోలిస్తే ఇప్పుడొచ్చిన ఇబ్బంది పెద్దదేమీ కాదు. కేసీఆర్​ కడుపు మాడ్చుకుని తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు.. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్​ కిష్టయ్య, యాదయ్య వంటి వాళ్లు ఆత్మబలిదానం చేసినప్పటి ఇబ్బందులతో పోలిస్తే పెద్ద ఇబ్బందులా ఇవి” అని తెలిపారు.

ఈ కేసుతో ఇబ్బందుల్లో ఉన్నామని అనుకోవద్దని, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. భూములు గుంజుకోవద్దని పోరాటం చేసిన లగచర్ల రైతులను 40 రోజుల పాటు జైల్లో పెట్టిన కేసుతో పోలిస్తే ఇప్పుడున్న కేసు పెద్దదేమీ కాదన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా హైదరాబాద్​, తెలంగాణ కోసం తీసుకున్నవేనని కేటీఆర్​ చెప్పారు. 

ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్​ కావాలి..

‘‘బీఆర్​ఎస్​ పార్టీ నేతలు, కార్యకర్తలు చేయాల్సిందల్లా కాంగ్రెస్​ అమలు చేయని హామీలపై కొట్లాడడమే. 2025ను పోరాటనామ సంవత్సరంగా ప్రతి కార్యకర్త భావించాలి. అందుకు తగ్గట్టు కాంగ్రెస్​ సర్కారుపై పోరాటం చేయాలి. ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్​లా పోరాటం చేయాలి” అని కేటీఆర్​ సూచించారు. రైతుబంధు పథకాన్ని ఆపాలంటూ ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ పార్టీ లేఖ రాసిందని, అధికారంలోకి వచ్చాక నాటి బీఆర్ఎస్ సర్కారు ఖజానాలో దాచిన సొమ్ముతోనే రైతుబంధు జమచేసిందని విమర్శించారు.

అధికారంలోకి రాకముందు కౌలురైతులపై ఎనలేని ప్రేమ చూపించారని, 27 లక్షల మంది రైతులకు రేవంత్​ లేఖ కూడా రాశారని తెలిపారు. కానీ, ఇప్పుడు వారికి రైతుభరోసాను ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్​ సర్కారు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. ‘‘మేడిగడ్డ పర్రెలిచ్చిందంటూ కాంగ్రె స్​ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నది. రేవంత్​ పుర్రెకే పర్రెలొచ్చినయ్. పెద్ద భూకంపం వచ్చినా, 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడింది. బీఆర్​ఎస్​పై అభాండాలు వేయడానికే ఆ బ్యారేజీని వాడడంలేదు” అని కేటీఆర్​ మండిపడ్డారు.  

నాకు పోలీసులు నోటీసుల మీద నోటీసులిస్తున్నరు: హరీశ్​ 

అప్పుల గురించి మాట్లాడితే నిండు అసెంబ్లీలోనే లెక్కలు చెప్పామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. ‘‘మేం కాళేశ్వరం కట్టినం, పాలమూరు కట్టినం, చెరువులు బాగుచేసినం. జిల్లాకో మెడికల్ కాలేజీ, గురుకులాలు కట్టినం. ఇంటింటికీ నల్లాలు పెట్టినం. నిరంతరాయ విద్యుత్ ఇచ్చినం. మేం ఏడాదికి 40 వేల కోట్లతో ఇవన్నీ చేస్తే.. నువ్వు రూ.1.40 లక్షల కోట్ల అప్పులతో ఒక్క పనీ చేయలేదు. ఈ మాట అడిగినందుకే కేటీఆర్​పై కేసులు పెట్టావు” అని సీఎం రేవంత్​రెడ్డిపై ఫైర్​ అయ్యారు. కేటీఆర్​పై పెట్టిన కేసు ప్రశ్నించే గొంతుక, ఓ ఉద్యమకారుడిపై పెట్టిన కేసు. కుట్రలో భాగంగానే ఈ అక్రమ కేసు పెట్టారు” అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలనూ ఎగ్గొడ్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ‘‘రేవంత్​ రెడ్డి అన్నీ ఎగ్గొట్టారని చెబుతూ.. ‘నువ్వు ఎనుముల రేవంత్​ రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్​ రెడ్డి’వి అని మానకొండూరు సభలో అన్నాను. అప్పట్నుంచి నాపై కేసులు పెడ్తున్నరు. పోలీస్​స్టేషన్​కు రావాలంటూ మానకొండూరు పోలీసులు నోటీసులమీద నోటీసులిస్తున్నరు” అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తున్నదని ఆయన విమర్శించారు. లగచర్ల రైతులను అరెస్ట్​ చేసి 15 రోజులు అటెన్షన్​ డైవర్షన్​ చేశారు. అల్లు అర్జున్​ పేరుతో ఇంకో డైవర్షన్​, తెలంగాణ తల్లి విగ్రహం పేరిట మరో డైవర్షన్​.. ఇట్ల ఎన్నో డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తున్నరు” అని హరీశ్​రావు దుయ్యబట్టారు