కాంగ్రెస్ అంటేనే మోసం.. రైతు భరోసాతో మరోసారి రుజువైంది: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అంటేనే మోసం, దగా అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారని విమర్శించారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి.. ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామని సవాలక్ష కండీషన్లు పెట్టారని మండిపడ్డారు. రైతుభరోసా మోసానికి జనవరి 26న అధికారికంగా రేవంత్ ప్రభుత్వం తెరలేపుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ తీరుకు మోసం అనే పదం చిన్నదవుతుందని అన్నారు. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ చేసిన ద్రోహం.. రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ భవన్​లో ఆదివారం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.

‘‘రైతు భరోసాను రూ.12 వేలకు కుదించి సంబురాలు చేయాలంటూ కాంగ్రెస్ చెప్తున్నది. కోతలు పెట్టినందుకు సంబురాలు చేయాలా? ఓట్ల కోసం ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు క్షీరాభిషేకాలు చేయాలా? కాంగ్రెస్ అబద్ధాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి. రైతు రుణమాఫీ, రైతుబంధుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ రైతుబంధువుగా నిలిచారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ముందా?’’అని కేటీఆర్ నిలదీశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది
గతంలో రైతుబంధుకు తాము ఇచ్చిన రూ.10 వేలనే రేవంత్ రెడ్డి బిచ్చం అని అవమానపర్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు దానికి అదనంగా కేవలం రూ.2 వేలు పెంచి ముష్టి వేస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రేవంత్ నుంచి రాహుల్ వరకు రైతులకు చెప్పిందేంటి? చేసిందేంటి? నమ్మించి మోసం చేసినందుకు 70 లక్షల మంది రైతులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి. ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని రేవంత్ అనడం వారిని అవమానించడమే అవుతుంది.

రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ మాట్లాడుతున్నరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది.. కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగాలేదు’’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్​గా ఉన్న హైదరాబాద్​లో హైడ్రా, మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. రైతుభరోసా విషయంలో మోసం చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం అన్ని జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు చేపడ్తామన్నారు.