రైతు భరోసా ఇస్తామని చెప్పి 26 వేల కోట్లు ఎగ్గొట్టిన్రు

  • బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ ట్వీట్​

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ సర్కార్  రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు వానాకాలం, యాసంగి కలిపి ​రూ.26 వేల కోట్లు ఎగ్గొట్టిందని కేటీఆర్​ఆరోపించారు. 1.53 కోట్ల టన్నుల వరిధాన్యం పండితే.. ప్రభుత్వం కొన్నది మాత్రం 46 లక్షల టన్నులేనన్నారు. కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ​అన్నట్టుగా కాంగ్రెస్​ సర్కారు తీరుందని మంగళవారం ఆయన ట్వీట్​లో విమర్శించారు. "క్వింటాలుకు రూ.500 బోనస్​ అని రైతుల్లో ఆశలు రేపారు. దొడ్డు వడ్లకు తెడ్డు చూపించి.. సన్నాలకూ సవాలక్ష కొర్రీలు పెట్టారు.

 ఇచ్చింది మాత్రం రూ.530 కోట్లే. అసలు రైతుకే భరోసా లేకపోగా.. కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిది. కల్లాల్లోనే కొనుగోళ్లతో రైతుకు కేసీఆర్ సర్కార్​గతంలో  కొండంత భరోసాగా నిలిచింది. కల్లోల కాంగ్రెస్​ పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు" అని తెలిపారు.  తెలంగాణలో ఏం జరుగుతోందంటూ మరో ట్వీట్ పెట్టారు. కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, అల్లర్లు, అబద్ధాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, కేసులు, అరెస్టులు తప్ప ఇంకేం జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు.