IPL 2025: ఆ ఫ్రాంచైజీకో దండం.. నన్ను కొనొద్దని కోరుకుంటున్నా: భారత ఆల్‌రౌండర్

ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లు అనగానే అందరూ చెప్పే పేర్లు.. చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(MI). మరో ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టైటిల్ గెలవలేదన్న పేరే కానీ, వారికున్న ఫ్యాన్ బేస్ మరో లెవెల్. ఆర్సీబీ మ్యాచ్ ఏ నగరంలో జరిగినా.. ఆ జట్టు అభిమానులు పోటెత్తుతారు. మరి ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త జట్టు ఏదీ అంటే.. ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్(PBKS) అంటున్నాడు.. ఓ భారత ఆల్‌రౌండర్. 

ఆ భారత ఆల్‌రౌండర్ మరెవరో కాదు.. కృష్ణప్ప గౌతమ్. తాను ఆడిన ఫ్రాంచైజీలన్నింటిలో పంజాబ్ కింగ్స్‌కు మళ్లీ ప్రాతినిధ్యం వహించకూడదని కోరుకుంటున్నట్లు ఈ ఆఫ్ స్పిన్నర్ స్పష్టం చేశాడు. అంతటితో అతని విమర్శలు ఆగలేదు. ఇది కేవలం క్రికెట్ అవకాశాల గురించి మాత్రమే కాదని.. అంతర్గత విభేదాలు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వంటివి అన్నీ వర్తిస్తాయని పేర్కొన్నాడు.

క్రికెట్.కామ్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణప్ప గౌతమ్ ను హోస్ట్.. 'మీరు ఆడకూడదనుకునే జట్టు ఏదైనా ఉందా? అని ప్రశ్నించగా.. భారత క్రికెటర్ 'పంజాబ్ కింగ్స్' అని సమాధానమిచ్చాడు. ఒకవేళ ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ యాజమాన్యం తనను దక్కించుకున్నా.. వంద శాతం ఆ జట్టు కోసం కష్టపడలేనని  స్పష్టం చేశాడు.

వారితో మంచి అనుభవం లేదు

"నేను పంజాబ్ కింగ్స్ అంటాను. నేను నిజాయితీగా ఈ మాట చెప్తున్నాను. ఆ ఫ్రాంచైజీతో నాకు ఎప్పుడూ మంచి అనుభవం లేదు. ఇది అవకాశాల గురించి మాత్రమే కాదు. ఇతర విషయాలు చాలా ఉన్నాయి. క్రికెటర్‌గా ఎవరినైనా ట్రీట్ చేయాలనుకునే పద్ధతి ఇది కాదు. నేను ఏ జట్టుకు ఆడినా.. ఆ జట్టు విజయం కోసం వంద శాతం కంటే ఎక్కువ కష్టపడతాను. కానీ ఐపీఎల్ 2025 సీజన్ కు పంజాబ్ కింగ్స్ నన్ను ఎంచుకుంటే, వంద శాతం కంటే ఎక్కువ ఇవ్వను, ఇవ్వలేను.." అని కృష్ణప్ప గౌతమ్ అన్నాడు.

మ్యాక్స్‌వెల్ ఆత్మకథలో..

పంజాబ్ కింగ్స్ గురించి ఒక క్రికెటర్ ఇలా బహిరంగ విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఆ జట్టు కెప్టెన్‌గా పని చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన ఆత్మకథలో పంజాబ్ జట్టు అంతర్గత పనితీరును బహిర్గతం చేశాడు. 2017 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనకు తెలియకుండా తుది జట్టును ఎంపిక చేసిన విషయాన్ని మాక్స్‌వెల్ ప్రస్తావించాడు.