తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లెటర్

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లెటర్
సమావేశానికి డేట్లు చెప్పాలని సూచన​ సంక్రాంతికి ముందే త్రిసభ్య​ కమిటీ మీటింగ్  నీటి అవసరాలు, వాడుకున్న నీటి లెక్కలు చెప్పాలని సూచన హైదరాబాద్​, వెలుగు: సంక్రాంతికి ముందే త్రీమెన్​ కమిటీ మీటింగ్​ నిర్వహించేందుకు కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) సిద్ధమవుతోంది. ఈ మేరకు జనవరిలో సమావేశానికి అనువైన డేట్లు చెప్పాల్సిందిగా తెలంగాణ, ఏపీలకు బోర్డు మెంబర్​ సెక్రటరీ డీఎం రాయ్​పురే గురువారం లేఖ రాశారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు అవసరమైన వాటర్​ ఇండెంట్స్​ను సమర్పించాలని కోరారు. ఈ ఏడాది డిసెంబర్​ చివరి వరకు ఉపయోగించుకున్న నీటి లెక్కలను జనవరి 8 నాటికి పంపించాలని సూచించారు. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు జనవరి పదో తేదీకి ఒకటి, రెండు రోజుల తర్వాత త్రీమెన్​ కమిటీ సమావేశానికి ఒప్పుకుంటే సంక్రాంతిలోపే సమావేశం నిర్వహిస్తామని, లేనిపక్షంలో పండుగ తర్వాత మీటింగ్​ ఉంటుందని బోర్డు అధికారులు తెలిపారు. ఏపీని కట్టడి చేయండి! నిరుడు ఉపయోగించుకోలేకపోయిన 51.21 టీఎంసీల నీటిని ఈ వాటర్​ ఇయర్​లో వాడుకునేందుకు అవకాశమివ్వాల్సిందిగా త్రీమెన్​ కమిటీ మీటింగ్​లో తెలంగాణ కోరనుంది. ఏపీ నిరుడు ఎక్కువ తీసుకున్న 9 టీఎంసీల నీటిని ఈ ఏడాది ఆ రాష్ట్ర కోటా నుంచి మినహాయించాలని ఇదివరకే బోర్డుకు లేఖ రాసింది. ఏపీ వరద రోజుల్లో తీసుకున్న నీటిని ఎకౌంట్​లో లెక్కించొద్దన్న ఏపీ లేఖపైనా అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో జనవరిలో నిర్వహించబోయే త్రీమెన్​ కమిటీ సమావేశం కీలకం కానుంది.