బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు:  బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలని అధికారులకు నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. మంగళవారం  కలెక్టరేట్ లో  ‘బేటీ పడావో - బేటీ బచావో’, ‘బచ్ పన్ బచావో ఆందోళన్’, బాల్యవివాహాల నిర్మూలనపై  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే మండలాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 

జిల్లాలో ప్రస్తుతానికి బాల్యవివాహాలు తగ్గినా ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో అవగాహన లేమితో పెళ్లిళ్లకు  ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు జరగకుండా  ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 12 –18 ఏళ్ల పిల్లల వివరాలను సేకరించి శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఈవో అబ్దుల్, జీపీడీఓ పద్మనలిని, సీడీపీఓలు, చైల్డ్ వెల్ఫేర్ లైన్ అధికారి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.