- ప్రభుత్వం తరఫున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అర్చకులు
- వేడుకలను వీక్షించిన 30 వేల మంది భక్తులు
- హాజరైన పలువురు ప్రముఖులు
- మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయం
సిద్దిపేట/ కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం సంబురంగా జరిగింది. వీర శైవ ఆగమ శాస్త్ర సంప్రదాయంలో మేళ తాళాలు, డప్పు చప్పుల్ల మధ్య కేతలమ్మ, మేడలాదేవిని మల్లన్న వివాహమాడారు. కొమురవెల్లిలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండప వేదిక మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామివారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున బంగారు పుస్తె మట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అర్చకులు సమర్పించారు. కల్యాణం తర్వాత భక్తులు గర్భగుడిలో స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మాజీ పీఎం మన్మోహన్ సింగ్ మృతికి సంతాప దినాలు పాటిస్తుండడంతో మంత్రులెవరూ మల్లన్న కల్యాణానికి హాజరు కాలేదు.
దృష్టి కుంభంతో తొలి దర్శనం
కొమురెల్లి మల్లన్న కల్యాణంలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ఆలయ గర్భగుడిలో దృష్టి కుంభం కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామివారి తొలి దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం మొదట ఆలయ గర్భగుడిలోని మూలవిరాట్ తో పాటు ఆలయ తోటబావి వద్ద మల్లన్న కల్యాణ మండపంలో ఉత్సవ విగ్రహాలకు కల్యాణ వేడుకలు జరిగాయి. మల్లన్న ఆలయంలోని గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మల్లికార్జున స్వామి, అమ్మవార్ల మూలవిరాట్ కల్యాణ వేడుకల్లో బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మల తరుపున మహదేవుని వంశస్తులైన రవి, -సింధు దంపతులు.. వరుడు మల్లికార్జునస్వామి తరుఫున పడిగన్నగారి వంశస్తులైన మల్లేశం, -బాలమణి దంపతులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. అనంతరం ఆలయగర్భ గుడి నుంచి మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా కోలాటాలతో తోటబావి వద్ద కల్యాణ మండపానికి చేర్చారు. వారణాసిలోని కాశీ మహాపీఠం శ్రీమద్ కాశీ జ్ఞాన సింహాసనాదీశ్వర జగద్గురు మల్లికార్జున విశ్వారాధ్యా, శివాచార్య భగవత్పాదుల పర్యవేక్షణలో మల్లన్న కల్యాణ వేడుకలు నిర్వహించారు. మల్లికార్జునస్వామి కల్యాణం 2 గంటల పాటు అంగరంగ వైభవంగా సాగింది.
హాజరైన పలువురు ప్రముఖులు
కొమురవెల్లిలో మల్లన్న కల్యాణోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. అలాగే, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప రెడ్డి, నాగపురి రాజలింగం, నాయకులు తడక లింగమూర్తి, మంచాల చిరంజీవులు, మాజీ జడ్పీటీసీలు సిల్వేరి సిద్ధప్ప, గిరి కొండల్ రెడ్డి, మల్లేశం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పలు విభాగల చైర్మన్లు కల్యాణోత్సవానికి హాజరయ్యారు.
ఘనంగా శకటోత్సవం
మల్లన్న కల్యాణోత్సవంలో భాగంగా రాత్రి శకటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మల్లన్న రథాన్ని మల్లన్న గుట్ట చుట్టూ తిప్పారు. ఆలయ ఈవో బాలాజీ, ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో రథానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ విగ్రహాలతో శకటోత్సవాన్ని నిర్వహించారు. శకటోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.